: శత్రువులను ఎదుర్కొనేందుకు మంత్రాలను నమ్ముకున్న లాలు కుటుంబం.. కష్టాల నుంచి బయటపడే వ్యూహం!

వరుసగా చుట్టుముడుతున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకు లాలు కుటుంబం కొత్త దారులు అన్వేషిస్తోంది. శత్రువులను ఎదుర్కొనేందుకు మంత్రతంత్రాలు, వాస్తును ఆశ్రయిస్తోంది. లాలు కుమారుడు,  బీహార్ ఆరోగ్యశాఖా మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (29) తాజాగా తన ఇంటి దక్షిణ గేటును మూసివేశారు.  వాస్తు నిపుణుల సలహా మేరకు దానిని మూసివేయించిన ఆయన ఉత్తరం వైపు ఉన్న చిన్నగేటును రాకపోకలకు ఉపయోగిస్తున్నారు.  పెట్రోలు పంపుల కేటాయింపుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఇటీవల షోకాజ్ నోటీస్ కూడా అందుకున్నారు. అలాగే లాలు కుటుంబాన్ని భూ కుంభకోణం, దాణా స్కామ్‌లు వేధిస్తున్నాయి. దీంతో వాటి నుంచి బయటపడేందుకు లాలు కుటుంబం మంత్రాలను నమ్ముకున్నట్టు సమాచారం.

గత రెండు రోజులుగా తేజ్ ప్రతాప్ బంగ్లా నుంచి ‘‘దుష్మన్ మార్‌జాన్ జాప్’’ (శత్రువులు నశించిపోదురు గాక) అనే మంత్రాలు వినిపిస్తున్నట్టు చెబుతున్నారు. రోజూ సాయంత్రం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మూడు గంటలపాటు ఇంట్లో మంత్రాలు జపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎర్రని అంగవస్త్రంపై తేజ్ ప్రతాప్ కూర్చోగా మంత్రగాడు పూజలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే తేజ్‌ప్రతాప్ చేతిలో, మెడలో రుద్రాక్ష దండ కనిపిస్తోందని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఒక్కొక్కటిగా వచ్చి పడుతున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకే లాలు కుటుంబం మంత్రతంత్రాలను ఆశ్రయిస్తోందని చెబుతున్నారు. కాగా, ఆరోగ్యశాఖా మంత్రి అయి ఉండీ మంత్రాలను ఆశ్రయించడం విడ్డూరంగా ఉందంటూ తేజ్‌ప్రతాప్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

More Telugu News