: లోకేష్ మాట్లాడుతుంటే, సమయమైపోయిందని సూచిస్తూ మోగిన గడియారం!

ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మహానాడు వేదికపై నుంచి ప్రసంగిస్తున్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. తొలుత ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుని, ఆపై చంద్రబాబునాయుడి కృషిని, కార్యకర్తల శ్రమను ప్రస్తుతిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఆయన మాట్లాడుతుంటే, మైకు పక్కనే ఉన్న గడియారం మోగింది. ఆపై గడియానాన్ని చేతిలోకి తీసుకున్న లోకేష్ "క్లాక్ మోగుతోంది. ఒక్క నిమిషమే ఉంది" అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

వాస్తవానికి నేతల ప్రసంగాల సమయాన్ని సూచించేందుకు, ప్రసంగం మొదలు కాగానే, అప్పటి నుంచి ఐదు నిమిషాల సమయం తరువాత అది మోగుతుంది. గడియారం మోగిన తరువాత ఒక్క నిమిషంలో ప్రసంగాన్ని ముగించాల్సి వుంటుంది. లోకేష్ ప్రసంగానికి వచ్చినప్పుడు కూడా దాన్ని ఆన్ లో ఉంచడంతో ఈ ఘటన జరిగింది.

తర్వాత లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రానికి కొత్తగా రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడి రానుందని, దీంతో రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ప్రతిపక్షాలు చెప్పేవన్నీ ఆరోపణలు మాత్రమేనని అన్నారు. కాగా, లోకేష్ మాట్లాడుతున్న వేళ, తెలుగుయువత కార్యకర్తలు పదేపదే ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతుంటే, "దయచేసి వినండి. ఒక్క నిమిషం ఆగండి" అంటూ లోకేష్ పదే పదే విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. ఇక గడియారం మోగి, ఒక్క నిమిషం సమయాన్ని సూచించినా, దాన్ని పట్టించుకోకుండా లోకేష్ ప్రసంగం సాగింది.

More Telugu News