: నాకు పెద్ద నోట్లు మార్చుకునే అవకాశం కల్పించండి: ప్రధాని మోదీకి మాజీ సెక్స్ వర్కర్ వినతి

గతంలో సెక్స్ వర్కర్ గా జీవితాన్ని గడిపిన బంగ్లాదేశ్ మహిళ తన వద్ద రద్దయిన పెద్ద నోట్లు పది వేల వరకు ఉన్నాయని, వాటిని మార్చుకునేందుకు ఆయన సాయం కావాలని కోరింది. ఈ మేరకు మోదీకి ఓ ట్వీట్ రూపంలో ఆమె ఓ లేఖ రాసింది. తాను సెక్స్ వర్కర్ గా మారడానికి గల కారణాలను ఈ సందర్భంగా సదరు మహిళ వివరిస్తూ.. తనకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు మహిళలు తనను భారత్ కు తీసుకు వచ్చి, సెక్స్ వర్కర్ గా మార్చారని చెప్పింది.

అయితే, 2015 డిసెంబర్ లో రెస్క్యూ టీమ్ సాయంతో తాను ఆ రొంపి నుంచి బయటపడ్డానని చెప్పింది. అప్పటి నుంచి స్వదేశానికి వెళ్లే ప్రయత్నాల్లో ఉండిపోయి.. తన వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోలేకపోయానని చెప్పింది. అయితే, తాను తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశ్ నుంచి అనుమతి రావడంతో ఈ నోట్లను మార్చుకోవాలని కోరుకుంటున్నానని, ఈ విషయమై సాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు విన్నవించుకుంది.

కాగా, పెళ్లయిన మూడేళ్లకు భర్తతో గొడవల కారణంగా తాను విడాకులు తీసుకున్నానని ఆమె పేర్కొంది. తల్లిదండ్రుల బాధ్యత తనపై ఉండటంతో బంగ్లాదేశ్ లోనే ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో రూ.9000కు పని చేశానని తన లేఖలో పేర్కొంది. అయితే, ఇండియాలో అయితే రూ.15,000 వరకు సంపాదించుకోవచ్చని ఆ ఫ్యాక్టరీలో పని చేసే సహ కార్మికుడు చెప్పడంతో భారత్ కు రావాల్సి వచ్చిందని చెప్పింది. మహారాష్ట్రలోని పూణేకి తనను తీసుకువచ్చారని, అక్కడ ఓ నేపాలీ మహిళకు తనను రూ.50,000కు అతను అమ్మేశాడని చెప్పింది. ఆ తర్వాత, తనను బెంగళూరులోని మరో మహిళకు అప్పగించారని, తన చేత బలవంతంగా వ్యభిచారం చేయించారని ఆ లేఖలో వాపోయింది.

2015లో రెస్క్యూ ఫౌండేషన్ సాయంతో తన నరక ప్రాయమైన జీవితానికి తెరపడిందని, ఆ రొంపి నుంచి బయటపడ్డానని పేర్కొంది. ఇదిలా ఉండగా, రెస్క్యూ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ అధికారులు స్పందిస్తూ.. బాధితురాలు తమతో మాట్లాడిన మాటలను ప్రస్తావించారు. ‘ ఇక్కడ నేను ఏం చేస్తున్నానన్న విషయం మా దేశంలో ఉన్న మా కుటుంబానికి తెలియదు. మంచి శాలరీతో నేను ఉద్యోగం చేస్తున్నానని వారికి చెప్పాను. కానీ, నా శరీరాన్ని, మనసుని అమ్ముకుని ఈ డబ్బు సంపాదించాను. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. ఈ డబ్బు (పెద్దనోట్లు) వృథా కావడానికి వీల్లేదు. నా లాంటి వాళ్లు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఈ డబ్బు చాలా పెద్ద మొత్తం’ అని బాధితురాలు వారితో పేర్కొన్నట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనం. దీనిని ప్రత్యేకమైన కేసుగా భావించి బాధితురాలికి ప్రభుత్వం సాయం చేయాలని రెస్క్యూ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ దీపేష్ ట్యాంక్ కోరారు.

More Telugu News