: ఆసక్తిగా రాష్ట్రపతి ఎన్నికలు... యూపీలో 150 సీట్లలో గెలుపు, అన్నాడీఎంకే మద్దతుంటేనే మోదీకి విజయం!

ఈ సంవత్సరం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే, యూపీలో కనీసం 150 సీట్లలో గెలుపుతో పాటు అన్నాడీఎంకే పార్టీ మద్దతు తప్పనిసరని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే జరగకుంటే, విపక్షాలన్నీ ఏకమైతే, వారు నిలిపే అభ్యర్థే విజయం సాధిస్తారని అంటున్నారు. వాస్తవానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటింగ్ విలువలన్నీ కలిపితే, మొత్తం 10,98,882 పాయింట్లు ఉన్నాయి. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 4,120 కాగా వారి ఓట్ల విలువ 5,49,474 పాయింట్లు. లోక్ సభలో 543, రాజ్యసభలోని 233 మంది ఎంపీల ఓట్ల విలువ 5,49,408 పాయింట్లు కాగా, ఈ లెక్క ప్రకారం గెలుపుకోసం కావాల్సినవి 5,49,442 పాయింట్లు.

ఇక ప్రస్తుతం బీజేపీ వద్ద 3.80 లక్షల పాయింట్లకు సమానమైన ఓట్లున్నాయి. విజయానికి కావాల్సిన 5.49 లక్షల ఓట్లతో పోలిస్తే, బీజేపీకి అదనంగా 1.70 లక్షల ఓట్లు అవసరం. బీజేపీకి మద్దతిస్తున్న ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలకు సుమారు లక్షకు పైగా పాయింట్లు ఉండటంతో, మరో 70 వేల పాయింట్లను ఆ పార్టీ తెచ్చుకోవాల్సివుంది. ప్రస్తుతం జరుగుతున్న యూపీ ఎన్నికల్లో 403 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, మొత్తం 83,824 పాయింట్లు లభిస్తాయి. రాష్ట్రంలోని జనాభా ఆధారంగా ఎమ్మెల్యేల ఓటుకు లభించే పాయింట్లను లెక్కిస్తారన్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం, అత్యధిక జనాభా ఉన్న యూపీలో ఎమ్మెల్యే ఓటుకు 208 పాయింట్లు లభిస్తాయి.

ఇదే సమయంలో సిక్కిం శాసన సభ్యుల ఓటుకు కేవలం 7 పాయింట్లు మాత్రమే దక్కుతాయి. ఇక తమ విజయానికి కావాల్సిన 70 వేల ఓట్ల సంపాదన ఆ పార్టీకి అంత సులువేమీ కాదని తెలుస్తోంది. యూపీ ఎన్నికల్లో 150 సీట్లను ఆ పార్టీ గెలుచుకుంటే, 31,200 పాయింట్లు, కనీసం 100 సీట్లను గెలుచుకుంటే, 20,800 పాయింట్లు లభిస్తాయి. దీంతో 37 లోక్ సభ, 13 రాజ్యసభ సీట్లున్న అన్నాడీఎంకేకు 35,400 పాయింట్లున్నాయి. తమిళనాడు అసెంబ్లీలోని ఆ పార్టీ ఎమ్మెల్యేల ఓట్ల విలువ 23,760 కాగా, ఆ పార్టీ మద్దతిచ్చి, యూపీ ఎన్నికల్లో సత్తా చాటితే బీజేపీ గెలుపు సులువవుతుంది.

More Telugu News