: భార‌త్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది.. సాక్ష్యాలు ఇవిగో..: ఐరాస‌లో పాకిస్థాన్ ఫిర్యాదు

భార‌త్‌పై పాకిస్థాన్ మ‌రోసారి త‌మ అక్క‌సును వెళ్లగక్కింది. భార‌త్‌పై ఐక్యరాజ్యసమితి కొత్త సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌కి ఫిర్యాదు చేసింది. తమ అంతర్గత విషయాల్లో భార‌త్‌ జోక్యం చేసుకోవ‌డంతో పాటు తీవ్రవాదాన్ని సైతం ప్రోత్సహిస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అందుకు సాక్ష్యాలంటూ కొన్ని పత్రాలను సైతం ఇచ్చింది. భార‌త్ పాల్ప‌డుతున్న ఈ చర్యలను నిరోధించాల‌ని పేర్కొంది. పాకిస్థాన్‌ తరపున శాశ్వత ప్రతినిధిగా ఉన్న మలీహా లోఢీ ఈ పత్రాలను ఆంటోనియో గుటెరెస్‌కి అందజేశారు. దానితో పాటు పాక్‌ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారైన సర్తాజ్‌ అజీజ్‌ రాసిన ఓ లేఖను కూడా అందజేశారు.

పాక్‌ రాయబారి చేసిన విన్న‌తితో ఆంటోనియో గుటెరెస్‌, మ‌లీహా లోఢీ మ‌ధ్య‌ స‌మావేశం ఏర్పాటు చేశామ‌ని ఐరాస అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ఈ సమావేశంలో చ‌ర్చించిన విషయాల‌పై మాత్రం వారు వెల్లడించలేదు. మ‌రోవైపు ఇస్లామాబాద్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో పాకిస్థాన్ ప్ర‌భుత్వం.. బలూచిస్థాన్‌, కరాచీల్లో ఉగ్రవాదానికి సంబంధించి భారతీయ గూఢచారి సంస్థల హ‌స్తాన్ని నిరూపించే ప‌లు పత్రాలు ఐరాసకు ఇచ్చామ‌ని పేర్కొంది. 2015 అక్టోబరులో కూడా ఇందుకు సంబంధించిన‌ మూడు పత్రాలు ఇచ్చామ‌ని, వాటికి అద‌నంగా ఇప్పుడు మ‌రిన్ని ప‌త్రాలు స‌మ‌ర్పించామ‌ని పేర్కొంది.

More Telugu News