: 98 పరుగుల వద్ద మూడో రోజు ఆట ముగించిన ఇండియా... ఆధిక్యం 298

విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 98 పరుగులు చేసింది. దీంతో ఈ టెస్టులో ఇంగ్లండ్ పై 298 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇంగ్లండ్, భార‌త్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు మొద‌టి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌల‌ర్ అశ్విన్ విజృంభించి బౌలింగ్ చేయ‌డంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు 255 ప‌రుగుల‌కే ఆలౌటైంది. మూడో రోజు ఆటను 103/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇంగ్లండ్ ప్రారంభించింది. టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ విజృంభించడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌ మెన్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ 200 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్.. విజయ్ (3), రాహుల్ (10)ల వికెట్లు తీసి షాకిచ్చాడు. అనంతరం పుజారా (1) కూడా విఫలమయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ (56), అజింక్యా రహానే (22) క్రీజులో కుదురుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో కూడా అర్ధ సెంచరీ చేయడం విశేషం. దీంతో మూడో రోజు ఆటముగిసే సమయానికి 34 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేయడం ద్వారా ఇంగ్లండ్ పై 298 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.

More Telugu News