: అమెరికా అధ్యక్షుడు ట్రంపే... జోస్యం చెప్పిన వానరం!

ఆక్టోపస్ 'పాల్' అందరికీ గుర్తుండే ఉంటుంది. 2010 ప్రపంచకప్ ఫుట్ బాల్ లో అంతిమ విజేత ఎవరో ముందుగానే జోస్యం చెప్పింది. ఇప్పుడు చైనాకు చెందిన ఓ కోతి కూడా అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరో జోస్యం చెప్పింది. ఈ కోతి పేరు 'గెడా'. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవుతారని ఇది తేల్చేసింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ల కటౌట్లను గెడా ముందు ఉంచారు. ఇద్దరి కటౌట్లను కాసేపు చాలా తీక్షణంగా చూసిన గెడా... చివరకు ట్రంప్ కటౌట్ ను కౌగిలించుకుని, ఆయనకు ముద్దు పెట్టింది. ఈ రకంగా, ట్రంపే అంతిమ విజేత అని తేల్చేసింది. మరో విషయం ఏమిటంటే... ఈ ఏడాది జరిగిన యూరోపియన్ సాకర్ ఛాంపియన్ షిప్ లో కూడా విజేత ఎవరో గెడా ముందుగానే చెప్పింది. ఛాంపియన్ గా పోర్చుగల్ గెలుస్తుందని గెడా చెప్పిన జోస్యం నిజమైంది. దీంతో, ట్రంప్ గెలవడం కూడా ఖాయమని అందరూ భావిస్తున్నారు. చైనాలోని షియాన్హూ ఎకొలాజికల్ టూరిజం పార్కులో ఈ మంకీ కింగ్ 'గెడా' ఉంటోంది.

More Telugu News