: ఘోర పరాజయాల నుంచి అద్భుతంగా పుంజుకున్న న్యూజిలాండ్

భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఘోరపరాజయాల నుంచి అద్భుతంగా పుంజుకుంది. టెస్టుల్లో పరాజయం పాలైన కివీస్ భారత్ కంటే మెరుగైన ర్యాంకు నుంచి ఒక్కసారిగా దిగజారింది. దీంతో వన్డేల్లో రాణించి భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ విఫలం కావడంతో బౌలింగ్ బలంపై దృష్టిపెట్టింది. దీంతో బౌలింగ్, ఫీల్డింగ్ ను పకడ్బందీగా, ప్రణాళిక ప్రకారం మోహరించింది. దీంతో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల వ్యూహంతో బరిలో దిగుతూ, మైదానంలో పాదరసంలా కదులుతూ టీమిండియా ఆటగాళ్లను మట్టికరిపించారు. సొంత ప్రేక్షకుల మధ్య ఆడుతున్న టీమిండియా బలహీనతలను సొమ్ము చేసుకుంటూ.. ఫీల్డింగ్ అమరికను సొమ్ముచేసుకుంటూ సౌతీ, బౌల్ట్, నషీమ్ విసిరిన వ్యూహాత్మక బంతులు భారత బ్యాట్స్ మన్ ను ఉచ్చులోకి లాగాయి. ప్రధానంగా సీనియర్ బౌలర్ సౌతీ సంధించిన యార్కర్లు, స్లో బంతులు టీమిండియా మిడిలార్డర్, టెయిలెండర్లపై ప్రభావం చూపితే... స్వింగర్లు టాప్ ఆర్డర్ పై ప్రభావం చూపాయి. స్పిన్నర్లు శాంటనర్, సోడీ వ్యూహాత్మక బౌలింగ్ కూడా టీమిండియా ఆటగాళ్లపై ప్రభావం చూపింది. దీంతో టీమిండియా చేతిలో ఘోరపరాజయం నుంచి అనితరసాధ్యమైన పట్టుదలతో కోలుకుని సిరీస్ లో నువ్వా? నేనా? అనే రీతిలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్ వైజాగ్ లో ఈ నెల 29న జరగాల్సి ఉండగా, తుపాను కారణంగా ఆ మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానం నెలకొంది. చుట్టూ కొండల మధ్య పల్లంలో ఉన్న ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియంలో తుపాను కారణంగా నిండే నీరు బయటకు వెళ్లిపోయే వీలుందా? అన్నది అనుమానమే. ఈ మ్యాచ్ జరగని నేపథ్యంలో రెండు జట్లు విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. లేని పక్షంలో ఉత్కంఠ రేపే ఫైనల్ మ్యాచ్... ధోనీకి అచ్చొచ్చిన వైజాగ్ లో హోరాహోరీ తప్పదు!

More Telugu News