: 'ఎమ్మార్పీ' పేరిట పేషంట్లను నిలువునా దోచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు!

క్వాలిటీతో కూడిన వైద్య సేవలను అందిస్తున్నామని చెబుతూ, పైపై మెరుగులే ఆకర్షణగా ప్రైవేటు ఆసుపత్రులు పట్టపగలే రోగులను ఎలా దోపిడీ చేస్తున్నాయో తెలియజెప్పే మరో ఉదాహరణ ఇది. లాభాపేక్షే ధ్యేయంగా తమ వద్దకు వచ్చే రోగులకు అధిక ఎంఆర్పీ ఉన్న ఔషధాలనే రాస్తూ, వాటి నుంచి 35 శాతం వరకూ లాభాలను దండుకుంటున్నాయి. ఉదాహరణకు, షాలినీ పహ్వా అనే యువతికి మల్టిపుల్ మెలోమా అనే ఓ రకమైన క్యాన్సర్ సోకింది. దీనికి నోవార్టిస్ తయారు చేస్తున్న జోమెటా అనే ఇంజక్షన్ ను ప్రతి నాలుగు వారాలకూ ఓమారు చొప్పున రెండేళ్లు చేయించుకోవాలని గుర్ గాంలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి సూచించింది. అక్కడ దీని ఖరీదు రూ. 15,200. ఇక ఆమె తన పని నిమిత్తం బెంగళూరుకు వచ్చి ఇంజక్షన్ కోసం విచారించగా, రూ. 4 వేలకే లభించింది. ఇక ఇదే విషయాన్ని గుర్ గాం ఆసుపత్రి వైద్యులకు చెప్పి, ఇంత ధర తేడా ఏంటని చెబితే, అదే ఔషధంతో కూడిన ఇంజక్షన్ ను సిప్లా సంస్థ జోల్డ్రియా పేరిట రూ. 2,800కే అందిస్తోందని, ఇకపై ఆ ఇంజక్షన్ ను తమ వద్దే చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు. "వారు ముందే నాకు తక్కువ ధరకు లభించే ఔషధాన్ని ఎందుకు సూచించలేదు? ఓ కూరగాయల మార్కెట్లో మాదిరిగా నేను బేరాలు చేయాలా? ఇప్పుడు మరో ఆసుపత్రిని సంప్రదించాను. అదే ఇంజక్షన్ ఫార్ములేషన్ ను రూ. 800కు నాట్కో సంస్థ జోల్డోనాట్ పేరిట ఇస్తోంది. దాన్ని వాడినా నాకు ఉపశమనం లభిస్తోంది. రూ. 800 ఎక్కడ? రూ. 15,200 ఎక్కడ? ఇదేనా ప్రైవేటు ఆసుపత్రుల తీరు?" అని ఆమె మండిపడుతున్నారు. అధిక ధరలున్న ఔషధాలు క్వాలిటీతో కూడినవిగా ఉంటాయని కొందరు రోగులు భావిస్తుంటారని, ప్రముఖ కంపెనీలు తయారు చేసే జెనరిక్ ఔషధాలు, ఒరిజినల్ డ్రగ్స్ తో సమానంగానే ఉంటాయన్న సంగతిని కొందరు విస్మరిస్తున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో పేషంట్లకే చాయిస్ వదిలి వేయాలని సూచిస్తున్నారు. ఇక జోమెటా ఔషధాన్ని రూ. 13 వేలకే ప్రైవేటు ఆసుపత్రులకు నోవార్టిస్ అందిస్తోందని, దీన్ని రూ. 15,200కు అమ్మడం ద్వారా ఆసుపత్రికి రూ. 2,200 లాభం మిగులుతోందని గుర్తు చేసిన వైద్య నిపుణులు, రూ. 2,800కు జోల్డ్రియాను అమ్మితే ఆ మేరకు లాభం మిగలదని చెప్పారు. ఇక సీరియస్ ఇన్ ఫెక్షన్లతో బాధపడుతూ, ఐసీయూల్లో ఉండే రోగులకు పది రోజుల పాటు యాంటీ బయాటిక్ ఇస్తే, ఆసుపత్రులకు రూ. 70 వేల నుంచి రూ. 1.4 లక్షల వరకూ మిగులుతోందని లెక్కలు చెబుతున్నాయి. సిప్లా అందించే మెరోక్రిట్ యాంటీ బయాటిక్ ఔషధం గ్రాముకు రూ. 2,965 కాగా, పెద్దలకు దీన్ని రోజుకు ఒకటి నుంచి రెండు గ్రాముల డోస్ వరకూ ఇస్తుంటారు. దీన్ని పది రోజులు వాడాలంటే రూ. 90 వేల నుంచి రూ. 1.8 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఇది ఆసుపత్రులకు గ్రాము రూ. 700 నుంచి రూ. 900 మధ్య లభిస్తుందని సమాచారం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమంటే, మెరోపినమ్ పేరిట ఇదే యాంటీ బయాటిక్ ను జువెంటస్ సంస్థ గ్రాము రూ. 698కి, లుపిన్ రూ. 988కి అందిస్తున్నాయి. తమకు లాభాలు తగ్గుతాయన్న ఆలోచనతో దీన్ని వాడేందుకు ప్రైవేటు ఆసుపత్రులు అంగీకరించడం లేదు. కేవలం ఔషధాల విషయంలో మాత్రమే కాదు. సిరంజీలు, బ్యాండేజ్ ల నుంచి డైపర్ల వరకూ భారీ డిస్కౌంట్లతో ప్రముఖ కంపెనీల నుంచి కొని, వాటిని ఎంఆర్పీ ధరలకు రోగులకు అంటకడుతున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి.

More Telugu News