: బ్యాంకులను ఆదుకునేందుకు కొన్ని ప్లాన్లు ఉన్నాయన్న అరుణ్ జైట్లీ

దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తమ వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ముంబైలో జరుగుతున్న 'మేక్ ఇన్ ఇండియా వారం' సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కీలక సంస్కరణలు అమలు చేయనున్నామని అన్నారు. సంస్కరణల గురించిన వివరాలను మాత్రం వెల్లడించని ఆయన, ప్రభుత్వ బ్యాంకులు రుణాల విషయంలో ఉదాసీనంగా ఉంటున్నాయని, ఆ ప్రభావమే ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ నెలాఖరులో పార్లమెంటు ముందు బడ్జెట్ ప్రతిపాదనలు తేనున్న ఆయన, మార్కెట్ ను ఆదుకునే దిశగా సంస్కరణలు సాగుతాయని, ఆ దిశగా నిదానంగానైనా ఇండియా ముందుకు సాగుతుందని అన్నారు. రిఫార్మ్స్ అమలు చేసే నిర్ణయానికి వచ్చే ముందు బ్యాంకర్లను సంప్రదిస్తామని తెలిపారు. జీఎస్టీ వంటి బిల్లుల అమలు ఆలస్యం అవుతుండటం పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ తగ్గడానికి కారణమని జైట్లీ అభిప్రాయపడ్డారు. "ఏ రకంగా చూసినా, ప్రభుత్వం ఒకే దిశగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. ఏ దశలోనూ మా ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా సంస్కరణల అమలుకు మేము కట్టుబడి ఉన్నాం. స్థిరమైన వృద్ధి ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం. అందరికీ ఒకే రకమైన పన్ను విధానం ఉండాల్సిందే. దీనివల్ల ప్రభుత్వాలకు ఆదాయమూ పెరుగుతుంది" అని జైట్లీ వెల్లడించారు. గ్రామీణ భారతావనిలో డిమాండ్ పెరిగేందుకు చర్యలు చేపట్టామని, క్రూడాయిల్ ధరల తగ్గుదల కారణంగా సమకూరిన నిధులను గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తామని, ఇప్పటికే మౌలిక వసతుల కల్పనకు ఎన్నో నిధులు కేటాయించామని తెలిపారు.

More Telugu News