: బెజవాడలో ఎండ వేడిమి ఎందుకంటే... కారణం చెప్పిన చంద్రబాబు!

నవ్యాంధ్ర పొలిటికల్ రాజధానిగా ఎదుగుతున్న విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే కాదు, ఏటా ఎండాకాలంలో అక్కడ భానుడు భగభగలాడటం మనకు తెలిసిందే. అక్కడి పరిసర ప్రాంతాలతో పోలిస్తే విజయవాడలోనే ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి? దీనికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కారణం చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు వారానికి ఐదు రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అక్కడ మండుతున్న ఎండలకు కారణమేంటో ఆయనకు బోధపడినట్టుంది. కొద్దిసేపటి క్రితం హరితహారంలో భాగంగా హెలికాప్టర్ల ద్వారా కొండలపై విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని ఆయన విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో మండుతున్న ఎండలకు గల కారణమేంటో చెప్పారు. చెట్లు లేకపోవడమే బెజవాడ ఎండలకు కారణమని ఆయన తేల్చేశారు. ఇకపై చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

More Telugu News