: తాలిబాన్ల దాడిలో ఇద్దరు తెలుగువాళ్ళ మృతి
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో తాలిబాన్లు రెచ్చిపోయారు. నాటో దళాల సరఫరా కేంద్రంపై నిన్న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి చెందారు. ఈ దాడిలో పశ్చిమబెంగాల్ కు చెందిన మరో వ్యక్తి కూడా మరణించాడు. ఓ ట్రక్కు నిండా పేలుడు పదార్థాలతో నాటో క్యాంపు ప్రవేశద్వారాన్ని ధ్వంసం చేసిన తాలిబాన్లు లోపలికి ప్రవేశించి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాదాపు 40 నిమిషాల పాటు నాటో దళాలకు, తాలిబాన్లకు మధ్య కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. వారిలో ముగ్గురు భారతీయులు కాగా, ఓ బ్రిటన్ జాతీయుడితో పాటు మరికొందరు విదేశీయులున్నట్టు భావిస్తున్నారు. కాగా, కాల్పులకు బలైన భారతీయుల మృతదేహాలను భారత్ కు పంపించేందుకు అక్కడి మనదేశ దౌత్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.