: మాజీ మంత్రి బన్సల్ కు ఊరట
రైల్వే ముడుపుల కేసులో కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ కు ఊరట లభించింది. సీబీఐ తన ఛార్జిషీటులో బన్సల్ పేరును చేర్చలేదు. కాగా, ఆయన మేనల్లుడు విజయ్ సింగ్లా, రైల్వే బోర్డు సభ్యుడు మహేశ్ కుమార్ పేర్లను సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. రైల్వే బోర్డులో సభ్యత్వం కోసం సింగ్లా.. మహేశ్ కుమార్ ను రూ.10 కోట్లు డిమాండ్ చేయగా, తొలుత రూ.90 లక్షలు చేతులు మారాయి. ఈ క్రమంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా సింగ్లాను అరెస్టు చేశారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో బన్సల్ తన పదవిని పోగొట్టుకున్నారు. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్ళు ఎక్కువ కావడంతో ఆయన రాజీనామా చేయకతప్పలేదు. ఈ కేసుకు సంబంధించి బన్సల్ ను కూడా సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.