: భారతీయులకు జర్మనీ వీసా జారీ ప్రక్రియ ఇక సులభతరం
తమ దేశం విచ్చేసే భారతీయులకోసం ఇకనుంచి వీసాలను వేగిరమే జారీ చేస్తామని భారత్ లోని జర్మనీ రాయబారి మైఖేల్ స్టైనర్ అన్నారు. ఈరోజు కాశ్మీర్లోని శ్రీనగర్ యూనివర్శిటీ విద్యార్థులతో ఆయన ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు జవాబిస్తూ, వీసా జారీ ప్రక్రియను ఔట్ సోర్సింగ్ సంస్థలకు అప్పగిస్తున్నామని, దీంతో, భారతీయులకు వీసాలు ఇక త్వరగానే అందుతాయని చెప్పారు. ఇంతకుముందున్న వీసా జారీ విధానం సంక్లిష్టంగా ఉండేదని ఆయన వివరించారు. తాజాగా సులభతరమైన వీసా ప్రక్రియ వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని పేర్కొన్నారు. నూతన విధానం ద్వారా వీసాలు వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.