: తెలంగాణపై ఏ ఎండకా గొడుగు పట్టిన దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన దిగ్విజయ్ సింగ్ ఏ ఎండకా గొడుగు పట్టి రాష్ట్రం దాటేశారు. ఓపికగా అందరి మాటలను చిద్విలాసంగా ఆలకించి, చిన్న చిన్న వ్యాఖ్యలతో గత ఇన్ఛార్జీలను మరిపించారు. తన వ్యవహారశైలితో నేతలందర్నీ ఆకట్టుకున్నారు. విభజన అంశాన్ని తెలివిగా రాష్ట్ర నేతలపైనే తోసేసి ఎంచక్కా విమానమెక్కేసి తన చతురతను చూపించారు.
వీరప్ప మెయిలీ, ఆజాద్ తరువాత దిగ్విజయ్ సింగ్ మరోసారి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీగా పదవీబాధ్యతలు స్వీకరించారు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానానికి వీర విధేయుడుగా పేరు తెచ్చుకున్న దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. రాష్ట్ర నాయకత్వం ఏ నిర్ణయం వైపు మొగ్గుతుందో అదే కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంగా వెలిబుచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అందుకు ముందుగా నేతల్ని సన్నద్దం చేసేందుకు అధిష్ఠానం పావులు కదుపుతోంది.
దిగ్విజయ్ 2014 ఎన్నికలకు, ముందు చూపుతో తెలంగాణ విభజన అంశాన్ని కదిపి విలీన ప్రతిపాదనలతో పార్టీలను, అధికారాన్ని తన దగ్గరే ఉంచుకునేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా దిగ్విజయ్ తనను కలిసేందుకు వచ్చిన సీమాంధ్ర నేతలతో రాష్ట్రవిభజన అంత తేలికైన విషయం కాదని, ఇప్పటికే వివిధ రకాలుగా చర్చలు జరిపినా రాష్ట్రవిభజన దేశ సార్వభౌమత్వానికి సవాలుగా మారుతుందని చెప్పారు. తెలంగాణ నేతలతో ఇప్పటికే గత ఇన్ఛార్జీలంతా విస్తృతంగా చర్చలు జరిపారని ఇక మిగిలింది నిర్ణయమేనని, విభజన తధ్యమని సూచనలిచ్చారు. దీంతో రెండు ప్రాంతాల నేతలు వారికి నచ్చిన భాష్యాలతో సంతోషంగా వెనుదిరిగారు.
అంతా సవ్యంగా ముగిశాక దిగ్విజయ్ సింగ్ సీఎం, పీసీసీ చీఫ్, డిప్యుటీ సీఎం లతో ప్రత్యేకంగా సమావేశమై రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరారు. ఇక్కడే పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటే రోడ్ మ్యాప్ లేకుండానే నిర్ణయం తీసుకుని ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటిస్తే దాన్ని యధావిధిగా అమలు చేస్తారా? అలాంటప్పడు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఎందుకు ఇంత లేటైంది? అన్న ప్రశ్నలు పార్టీలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయినా అధిష్ఠానం లోగుట్టు పెరుమాళ్లు కెరుక అంటూ ప్రజాప్రతినిధులు మౌనంగా ఉన్నారు. ఇంతకీ విడిపోతుందా? విడిపోదా? అన్నది మాత్రం భేతాళ ప్రశ్నలా మరోసారి మిగిలిపోయింది.