: రాయుడి దశ తిరిగేనా?


అంబటి రాయుడు.. అన్ని స్థాయిల్లోనూ భారత దేశవాళీ క్రికెట్లో పరుగుల మోత మోగించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న క్రికెటర్. ఇప్పుడు భారత్ కెప్టెన్ ధోనీ గాయంతో వైదొలగడంతో విండీస్ లో జరుగుతున్న ముక్కోణపు టోర్నీకి ఎంపికయ్యాడు. గుంటూరుకు చెందిన రాయుడు తొలుత హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా అక్కడి క్రీడారాజకీయాలు ఆ యువకుణ్ణి పరాయి జట్లవైపు నడిపించాయి. ప్రస్తుతం అతడు దేశవాళీల్లో బరోడా జట్టు తరుపున ఆడుతున్నాడు.

బీసీసీఐ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్ తో బాహాబాహీ రాయుడి కెరీర్ ను తాత్కాలికంగా మసకబార్చినా.. అనతికాలంలోనే అమావాస్యచంద్రుడి మల్లే కాంతులీనాడు. ప్రతిభకు ఏదీ అడ్డంకి కాదని నిరూపిస్తూ ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించి దిగ్గజం సచిన్ ప్రశంసలకు పాత్రుడయ్యాడు. అయితే, దేశంలో ఉన్న ప్రతిభావంతులైన క్రికెటర్లలో రాయుడు ఒకడనేది క్రికెట్ పండితులు ఎవరైనా చెప్పేమాటే. కానీ, జాతీయ జట్టులో ఎప్పుడో స్థానం దక్కించుకోవాల్సిన ఈ తెలుగుతేజానికి ప్రతిభకు తగ్గ న్యాయం జరగలేదు.

ఈ సీజన్ లో రాయుడు ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలతో 667 పరుగులు సాధించాడు. సగటు 60. 54 కావడం విశేషం. ఇరానీ కప్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ లో 51, రెండో ఇన్నింగ్స్ లో 156 నాటౌట్ గా నిలిచి సత్తా చాటి సెలెక్టర్ల మదిలో నిలిచాడు. ఇంతకుముందోసారి కూడా రాయుడిని అదృష్టదేవత కనికరించలేదు. గతేడాది ఇంగ్లండ్ తో టీ20ల్లో మనోజ్ తివారీకి గాయం కావడంతో రాయుడిని ఎంపిక చేసినా తుది జట్టులో స్థానం దక్కలేదు. ఈసారి కెప్టెన్ ధోనీ స్థానంలో జట్టులోకొచ్చినా.. మ్యాచ్ ఆడేది సందేహంగానే కనిపిస్తోంది.

ఎందుకంటే.. రిజర్వ్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ జట్టులో ఉండడం రాయుడికి ప్రతికూలంగా మారనుంది. తుదిజట్టులో కార్తీక్ కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విండీస్ తో ఓటమి నేపథ్యంలో లంకపై తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ కావడంతో తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రయోగాల జోలికిపోకపోవచ్చు. దీంతో, అరంగేట్రం కోసం రాయుడు మరికొంతకాలం నిరీక్షించక తప్పదనిపిస్తోంది.

  • Loading...

More Telugu News