: శునకానికి శాంతి చేయాలనుకున్నాడు.. జైలుకెళ్లాడు
విశ్వాసానికి మారు పేరు శునకం. మనిషి విశ్వాసాన్ని మరచిపోతాడేమో కానీ శునకానికి అది చేతకాదు. ఒక్క బిస్కెట్ వేసినా ప్రాణం పోయే వరకూ గుర్తుంచుకుంటుంది. అంతటి అపురూప మానవ నేస్తం శునకం. అన్నం పెట్టిన యజమాని ఆపదలో ఉంటే తన ప్రాణాన్ని అడ్డేస్తుంది.
అలాంటి శునకం కోసం పాకిస్థాన్ లో ఒక పౌరుడు అరెస్టయ్యాడు. అది రావల్పిండి పట్టణం. ఒక కుక్క చనిపోయి రోడ్డు పక్కనే పడి ఉంది. అటుగా వచ్చిన యువకుడు దానిని చూసి చలించిపోయాడు. మనిషి కోసం బతికే ఈ జంతువుకు తనవంతు బాధ్యతగా అంతిమ సంస్కారాలు జరపాలనుకున్నాడు. ఒకవస్త్రంలో కుక్క మృత దేహాన్ని ఉంచి శ్మశాన వాటిక సమీపానికి తీసుకెళ్లాడు.
మనుషుల సమాధుల పక్కనే దానినీ సమాధి చేస్తే అందరూ అభ్యంతర పెడతారనుకున్నాడు. అందుకే శ్మశానం బయటే ఓ గోయి తవ్వాడు. దాన్ని సమాధి చేసే లోపే.. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి వెంటనే జైలుకు కూడా పంపించేశారు. స్థానికుల మనోభావాలకు విఘాతం కలిగేలా వ్యవహరించినందుకే ఇలా చేశామని పోలీసులు తెలిపారు.
మన కోసం బతికే మూగజీవి ఆత్మకు శాంతి కలగాలన్న అతడి ప్రయత్నం పాపం ఫలించలేదు. కానీ, మరణించిన ఆ శునకం మరోసారి పుడితే అతడు తనకోసం జైలుకెళ్లిన విషయాన్నీ మరువదేమో!