: ఈ అమ్మ జన్మనేకాదు, పునర్జన్మను కూడా ఇచ్చింది
అమ్మ మనకు జన్మనిస్తుంది. పుట్టిన తర్వాత మన అవసరాలను అనుక్షణం గమనిస్తూ వాటిని తీరుస్తుంటుంది. అంత జాగ్రత్తలు తీసుకుంటుంది అమ్మ. అయితే ఈ అమ్మ మాత్రం కేవలం జన్మనే కాదు తన శరీరంలోని ఊపిరితిత్తిని కూడా ఇచ్చి తన బిడ్డను కాపాడుకుంది. దీంతో రెండుసార్లు ఆ బిడ్డకు జన్మనిచ్చినట్లయింది.
జపాన్‌లో మూడేళ్ల బాలుడికి ఊపిరితిత్తికి సంబంధించిన సమస్య వచ్చింది. దీంతో ఆ బాలుడికి ఊపిరితిత్తి మార్పిడి చేయాల్సి వచ్చింది. బతికి ఉన్న వారినుండే ఊపిరితిత్తిని సేకరించి అమర్చాల్సి ఉంది. దీంతో వైద్యులు ఆ బాలుడి తల్లి ఊపిరితిత్తి మధ్య ఖండాన్ని ఎంపిక చేసుకుని దాన్ని జాగ్రత్తగా సేకరించి ఆ బాలుడికి అమర్చారు. ఇలాంటి చికిత్స ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిది కావచ్చని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఊపిరితిత్తుల దిగువ ఖండాన్నే మార్పిడి సంబంధించిన శస్త్రచికిత్సలో వాడుతారు. అయితే బాలుడు చిన్న వయసువాడు కావడం వల్ల ఊపిరితిత్తుల మధ్య ఖండం పరిమాణంలో బాగా చిన్నగా ఉంటుంది కాబట్టి బాలుడికి సరిపోతుందని అందుకనే మధ్య ఖండాన్ని ఎంపిక చేసుకున్నట్టు ఆసుపత్రి వైద్య నిపుణులు చెబుతున్నారు. సుమారు ఐదు గంటల శస్త్రచికిత్స అనంతరం ఆ బాలుడు తన తల్లి ఊపిరితిత్తితో శ్వాసపీల్చుకున్నాడు. ఇలా ఊపిరితిత్తి మార్పిడి చేసుకున్న అతి చిన్న వయసు బాలుడు ఇతడేనని, అలాగే ఇలాంటి అరుదైన చికిత్స కూడా ఇదే మొదటిదని వైద్యులు చెబుతున్నారు.