: ప్రోటోకాల్ కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు
రాష్ట్రప్రభుత్వం ప్రోటోకాల్ వివాదాలకు స్వస్తి పలికే విధంగా ఉత్తర్వులు జారీచేసింది. స్థానిక సంస్థలు, ఇతర అధికారిక కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం, ఆహ్వాన పత్రాలు, శిలాఫలకాల్లో పేర్లు ఏ క్రమంలో ఉండాలన్న అంశాలను ఈ ఉత్తర్వుల్లో తాజాగా నిర్దేశించారు. శాసనసభ హక్కుల కమిటీ ఇచ్చిన నివేదిక సిఫార్సులను అధ్యయనం చేసిన ప్రభుత్వం వాటిని ఆమోదిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వంటివారికి ఏ రకమైన మర్యాద పాటించాలన్న అంశంపై స్పష్టతనిచ్చారు. వీటి ఉల్లంఘనకు పాల్పడితే బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణాచర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి ఉత్తర్వుల్లో వివరించారు.