: సంజయ్ దత్ కు జైల్లో 'సినిమా' చూపిస్తారట!
ముంబయి బాంబు పేలుళ్ళ కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కొత్త చిత్రం 'పోలీస్ గిరి' విడుదలకు సిద్ధమవుతోంది. బాంబు పేలుళ్ళ కేసులో సంజయ్ దత్ కు సుప్రీం కోర్టు ఐదేళ్ళ శిక్ష ఖరారు చేస్తూ.. లొంగిపోయేందుకు కొద్దివారాల గడువిచ్చింది. ఈ వ్యవధిలో ఆయన తన సినిమాల షూటింగ్ లను శరవేగంతో పూర్తి చేసేందుకు రేయింబవళ్ళూ శ్రమించారు. పగలు షూటింగ్ లతో, రాత్రిళ్ళు డబ్బింగ్ లు చెబుతూ నిర్మాతల శ్రేయస్సే లక్ష్యంగా కష్టించారు. ఈ క్రమంలో 'పోలీస్ గిరి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు చిత్రాన్ని హీరో సంజయ్ దత్ కు చూపించాలని నిర్మాత రాహుల్ అగర్వాల్ భావిస్తున్నారు.
సంజూ పుణేలోని యెరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. జైలు నిబంధనలు అనుసరించే ఆయనకు సినిమాను చూపిస్తామని అగర్వాల్ చెప్పారు. నియమావళి ప్రకారం జైల్లో నెలకు ఒకసారి సినిమా ప్రదర్శించే వెసులుబాటు ఉంటుంది. ఆ కోటాలో తమ సినిమాను ప్రదర్శిస్తామని అగర్వాల్ తెలిపారు. జైలు వర్గాలు తమకు అనుమతి మంజూరు చేస్తాయని ఆశిస్తున్నట్టు అగర్వాల్ పేర్కొన్నారు.