: భారత ఎంబసీపై అమెరికా గూఢ'చౌర్యం'
అమెరికా జాతీయ భద్రత సంస్థ (ఎన్ఎస్ఏ).. భారత ఎంబసీపై గూఢచర్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అమెరికా రహస్య కార్యకలాపాల గురించి ప్రపంచ దేశాలకు ఎలుగెత్తిచాటుతూ.. ప్రస్తుతం అగ్రరాజ్యానికి కంట్లో నలుసులా మారిన ఎడ్వర్డ్ స్నోడెన్ తాజాగా మరికొన్ని రహస్యాలను బట్టబయలు చేశాడు. అమెరికాలోని భారత దౌత్య కార్యాలయంతో సహా మరో 38 లక్ష్యాలపై ఎన్ఎస్ఏ కన్నేసిందని, అక్కణ్ణించి సమాచారాన్ని దొంగిలించిందని స్నోడెన్ వెల్లడించాడు. ఈ మేరకు స్నోడెన్ పలు పత్రాలను కూడా మీడియాకు ప్రదర్శించినట్టు 'గార్డియన్' పత్రిక పేర్కొంది.
వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో ఉన్న ఆయా దేశాల దౌత్య కార్యాలయాల కంప్యూటర్ నెట్ వర్క్ లలోకి చొరబడి విలువైన సమాచారాన్ని తస్కరించిందని స్నోడెన్ ను ఉటంకిస్తూ 'గార్డియన్' వివరించింది. అమెరికా బాధిత దేశాల్లో భారతే కాకుండా.. ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, టర్కీ వంటి మిత్రదేశాలే అధికంగా ఉన్నాయి.
ఈ వివరాలను ప్రపంచానికి బహిర్గతం చేసిన స్నోడెన్ పూర్వాశ్రమంలో ఎన్ఎస్ఏ ఉద్యోగి. రహస్యాలను వెల్లడి చేయడంతో అతడిపై తస్కరణ, ద్రోహం కేసులను నమోదు చేసిన అగ్రరాజ్యం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దీంతో, అమెరికాను వీడిన స్నోడెన్ పలు దేశాల మీదుగా రష్యా చేరుకున్నాడు. ప్రస్తుతం అతడు మాస్కో విమానాశ్రయంలో ఆశ్రయం పొందుతున్నాడు.