: ఎల్టీటీఈపై నిషేధం సబబే: మద్రాస్ హైకోర్టు
శ్రీలంకలో తమిళ వేర్పాటు వాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ)పై కేంద్రం విధించిన నిషేధాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. 2010-12 మధ్య ఈ మిలిటెంట్ సంస్థపై కేంద్రం నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎండీఎంకే చీఫ్ వైగో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం కేంద్రం నిర్ణయం సబబే అని పేర్కొంది.
కాగా, లంక తమిళుల కోసం ప్రత్యేక రాజ్యం ఉండాలని ఎల్టీటీఈ భావించిందని, అదేమీ భారత సార్వభౌమత్వానికి భంగకరం కాదని, దేశానికి ఏమీ ముప్పు ఉండబోదని వైగో తన పిటిషన్ లో వివరించారు. 2009లో లంక సైన్యం రెండు దశాబ్దాల ఎల్టీటీఈ పోరాటానికి చరమగీతం పాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లంక సైనికులు తమిళుల పట్ల పలు అకృత్యాలకు పాల్పడ్డారని మానవ హక్కుల సంఘాలు ఎలుగెత్తాయి.