: టికెట్ లేకుండానే విమానంలో ఊరెళ్లాడు
టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం కొందరికి చిటికెలో పని. ఎందుకంటే, టీసీ వచ్చినప్పడు బాత్రూములోనో, మరోచోటో దాగితే తప్పించుకునే అవకాశం ఉంటుంది. బస్సులో అయితే కండక్టర్ ప్రతి ఒక్కరినీ టికెట్..టికెట్ అని అడుగుతాడు. కానీ, కొందరైతే బస్సు కండక్టర్ కు కూడా మస్కా కొట్టి టికెట్ తీసుకోకుండానే గమ్యం చేరుకుంటారు. ఇప్పడు చెప్పేది వింటే కళ్లు గుండ్రంగా తిరగడం ఖాయం. ఓ 12 ఏళ్ల కుర్రోడు ఏకంగా విమానంలోనే టికెట్ లేకుండా ప్రయాణించాడు.
విమానాశ్రయాలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ప్రతీ వ్యక్తినీ క్షుణంగా తనిఖీ చేయకుండా, ప్రయాణానికి అన్ని అనుమతులూ ఉన్నాయని నిర్ధారించుకోకుండా లోపలికి అనుమతించరు. ఒకదేశం నుంచి మరొక దేశానికి వెళ్లే ప్రయాణికుల విషయంలో ఈ తనిఖీలు పూర్తి స్థాయిలో జరుగుతాయి. కానీ, ఇవన్నీ తెలియని ఆ పిల్లాడు 'దొంగా పోలీస్' ఆటలా భద్రతా సిబ్బందిని బురిడీ కొట్టించాడు.
బెల్జియం దేశలోని బ్రస్సెల్స్ విమానాశ్రయంలోకి 12 ఏళ్ల పిల్లవాడు ప్రవేశించాడు. ఎలా వచ్చాడో తెలియదు. ఎవరూ అతడిని తనిఖీ చేయలేదు. జేబులో గుర్తింపు కార్డు కూడా లేదు. స్పెయిన్ వెళుతున్న విమానం ఎక్కేశాడు. దర్జాగా స్పెయిన్ దేశంలోని మలాగా విమానాశ్రయంలో దిగిపోయాడు. కానీ, చివరికి ఈ పిల్లోడు టికెట్ లేకుండా, తనిఖీలు లేకుండా ప్రయాణించాడని మలాగా విమానాశ్రయ అధికారులు గుర్తించారు. సీసీటీవీ కెమేరాలు, ఇతర వివరాల ఆధారంగా అసలు ఇదెలా సాద్యమైందని? తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొద్ది రోజుల కిందటే జరిగిన సంఘటన. టికెట్ లేకుండా ప్రయాణించి ఈ కుర్రోడు ఔరా అనిపించాడు.