: నన్నెవరు పిలిచారు?: దానం
తెలంగాణ రాష్ట్ర సాధన సభకు తననెవరూ ఆహ్వానించలేదని, అందుకే ఆ సభకు హాజరుకాలేదని మంత్రి దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు దానం విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ విషయమై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక దిగ్విజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడం తథ్యమని మంత్రి జోస్యం చెప్పారు.
కాగా, నిన్న సాయంత్రం నిజాం కళాశాలలో జరిగిన కాంగ్రెస్ నేతల తెలంగాణ రాష్ట్ర సాధన సభలో పలువురు మంత్రులు, ఎంపీలు హాజరైనా దానం మాత్రం పాల్గొనలేదు. రాష్ట్ర విభజన ఇష్టంలేకే ఆయన హాజరుకాలేదని రాజకీయ వర్గాల్ల ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్పందించిన దానం తననెవరూ పిలవలేదని స్పష్టం చేశారు.