: మహిళా తహశీల్దార్ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే ధర్నా
కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న తహశీల్దార్ ను వెంటనే మార్చాలని డిమాండు చేస్తూ కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే డి.వై.దాస్ స్థానిక ప్రజలతో కలసి ధర్నా నిర్వహించారు. పెదపారపూడి తహశీల్దార్ గా పి.జయశ్రీ గత నెల 15న బాధ్యతలు స్వీకరించారు. ఆమె విధుల్లోకి చేరిన పది రోజుల నుంచి ఎస్సీ విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో ఇబ్బంది పెడుతున్నారని దాసుకు ఫిర్యాదులు అందాయి. దీంతో తహశీల్దారుతో ఎమ్మెల్యే ఫోనులో మాట్లాడారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమెను మార్చాలని ఆర్డీవో, కలెక్టర్లకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అయినా మార్పు లేకపోవడంతో నేరుగా మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. తహశీల్దార్ ను మార్చేవరకూ శాంతించబోమని ఆయన అంటున్నారు.