: మనిషి దురాశే ఉత్తరాఖండ్ ఘటనకు కారణం
ఉత్తరాఖండ్ ఘటనకు మనిషి దురాశే కారణమని ప్రముఖ సామాజిక వేత్త, నీటి ఉద్యమకారుడు రాజేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ తరహా వరదలు ఆంధ్రప్రదేశ్ ను కూడా ముంచెత్తే అవకాశముందని హెచ్చరించారు. హైదరాబాదులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ, కార్పొరేట్, ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వాలు గులాంగిరీ చేస్తున్నంత కాలం ఇలాంటి విపత్తులు తప్పవని అన్నారు. ఉత్తరాఖండ్ ఘటనకు ప్రధాన కారకులు కార్పొరేట్, ప్రైవేటు కంపెనీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ముందుచూపులేని భక్త సమాజం అని తెలిపారు. ఇప్పటికైనా హిమాలయాల రక్షణకు చర్యలు చేపట్టాలని, లేకపోతే మరిన్ని విపత్తులకు సిద్దం కావాల్సిందేననీ అన్నారు. అభివృద్ధి పేరుతో పర్యావరణం, నదులు, అడవులను నాశనం చేస్తున్నారని, జరుగుతున్న విధ్వంసాలన్నీ మానవ తప్పిదాలేనని తెలిపారు.