: కంటతడి పెట్టిన జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత
బాల్యం కొందరికి మధుర జ్ఞాపకం అయితే, మరికొందరికి చేదు అనుభవాల సమాహారం. సుప్రసిద్ధ రచయిత, జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ విషయంలోనూ అదే జరిగింది. బాల్యంలో జరిగిన ఓ సంఘటన ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన చేత కంటతడి పెట్టించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని మెక్లారిన్ ఉన్నత పాఠశాల లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భరద్వాజ, తన చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాన్ని తలుచుకుని కంటతడి పెట్టారు. తాను ఏడవ తరగతి చదువుతున్న సయయంలో ఓ రోజు పాఠశాల తనిఖీ చేసేందుకు ఇన్ స్పెక్టర్ వస్తున్నారంటూ.. విద్యార్థులందరినీ మంచి దుస్తులు వేసుకురావాలని టీచర్లు పురమాయించారని చెప్పారు. తాను మాత్రం పేదరికం కారణంగా సరైన దుస్తులు వేసుకెళ్ళలేకపోవడంతో టీచర్లు తిట్టారని వెల్లడించారు. ఆ విషయం జ్ఞప్తికి తెచ్చుకున్న సమయంలో భరద్వాజ కళ్ళు చెమ్మగిల్లాయి. సభికుల హృదయాలూ బరువెక్కాయి!