: మండిపడుతున్న మద్రాస్ క్రిస్టియన్ కాలేజి విద్యార్థులు


కాలేజీ విద్యార్థులన్న తర్వాత కాస్తంత కలర్ ఫుల్ గా, రొమాంటిక్ గా కనిపించాలనుకుంటారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా నేటి తరంలో ఫేడెడ్ జీన్స్ లు, ప్రింటెడ్ టీ షర్టులతో నియో మోడ్రన్ లుక్కుతో తళుక్కుమనడం సహజం. కానీ, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల విద్యార్థులు మాత్రం ఆంక్షల వలయంలో పరిభ్రమిస్తున్నారు. ఆ కాలేజీ యాజమాన్యం వారిపై బలవంతంగా డ్రెస్ కోడ్ ను రుద్దడమే అందుకు కారణం. అబ్బాయిలైతే మామూలు షర్టు ప్యాంటు.. లేకపోతే టీషర్టులు కాలర్ ఉన్నవి మాత్రమే ధరించాలట. కొన్ని డిపార్ట్ మెంట్లయితే తమను జుట్టు పొట్టిగా కటింగ్ చేయించుకుని రావాలని కోరుతున్నాయని అబ్బాయిలు వాపోతున్నారు.

అమ్మాయిలు చిట్టిపొట్టి డ్రెస్సులకు స్వస్తి చెప్పి, నిండుగా సల్వార్ కమీజ్ వంటి దుస్తుల్లో కనిపించాలట. ఇక స్లీవ్ లెస్ డ్రెస్సులేస్తే కఠిన చర్యలు తప్పవటండోయ్. వీటన్నిటికి తోడు మెడలో ఐడీ కార్డు తగిలించుకోవాలనే సరికి విద్యార్థుల కోపం నషాళానికంటింది. 'ఏమిటిది, మేమేమన్నా ఐటీ ప్రొఫెషనల్స్ మా.. సాంకేతిక విద్యనభ్యసిస్తున్నామా?' అని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు అక్కడి విద్యార్థులు.

ఇక ఈ నిరసన జ్వాలలపై కాలేజీ విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ నిబంధనలు ఎప్పటినుంచో వస్తున్నాయని, కాలేజీ సంప్రదాయాలను గౌరవించాలని సలహా ఇస్తున్నారు. ఇక మెడలో ఐడీ ట్యాగ్స్ గురించి చెబుతూ.. 365 ఎకరాల విస్థీర్ణంలో సువిశాలంగా విస్తరించిన ఈ కాలేజీకి ఎన్నో గేట్లు ఉండడంతో.. బయటి వ్యక్తులు లోపలికి ప్రవేశించడం సులభమని, ఎవరు ఎవరో గుర్తించడానికే ఐడీ కార్డులు ధరించమని కోరామని వెల్లడించారు.

గతేడాది బయటివ్యక్తులు కొందరు ఓ ప్రొఫెసర్ ను చితకబాదిన సంఘటనను ఈ సందర్భంగా ఉదహరించారు డీన్ మహాశయులు. అంతేగాకుండా చిన్నపాటి దొంగతనాలు కళాశాలలో జరుగుతున్నందునే మెడలో ఐడీ ట్యాగ్స్ తప్పనిసరి చేశామని వివరించారు.

  • Loading...

More Telugu News