: బాలీవుడ్ లో 'బ్యాడ్' టైం నడుస్తోందంటున్న అక్షయ్ కుమార్
హోటల్ చెఫ్ గా కెరీర్ మొదలెట్టి.. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించి..బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడిగా ఎదిగిన అక్షయ్ కుమార్ ఏమంటున్నాడో వినండి. ప్రస్తుతం బాలీవుడ్ లో దుష్ట స్వభావం ఉన్న పాత్రలే అలరిస్తున్నాయని చెప్పాడు. ఇటీవల కాలంలో మాఫియా డాన్ లు, గ్యాంగ్ స్టర్ల పాత్రలే హీరోలుగా సినిమాలు తెరకెక్కుతున్నాయని అక్షయ్ అభిప్రాయపడ్డాడు. అలాంటప్పుడు నెగిటివ్ రోల్స్ పోషించడానికి తనకేం అభ్యంతరం ఉంటుందని ప్రశ్నిస్తున్నాడు.
తాజా చిత్రం 'ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబయి-దోబారా'లో అక్షయ్ ది మాఫియా డాన్ షోయబ్ పాత్రే. తొలుత ఈ పాత్రకు ఇమ్రాన్ హష్మిని అనుకున్నా తర్వాత అక్షయ్ తో భర్తీ చేశారు. ఈ పాత్ర దావూద్ ఇబ్రహీంను పోలిందని సినీ వర్గాలంటున్నాయి. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కథానాయిక. ఆగస్టు 15న విడుదల కానుంది.