: షుగరుకు టీకా రెడీ


మధుమేహ వ్యాధి రాకుండా ఉండేందుకు ఒక కొత్త రకం టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కొత్త టీకా మధుమేహానికి కారణమయ్యే గతి తప్పిన రోగనిరోధక ప్రతిస్పందనను ఎంచుకుని పనిచేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పుట్టుకతో డిఎన్‌ఏ పనితీరును మారుస్తూ వచ్చే టైప్‌1 మధుమేహాన్ని తగ్గించేందుకు ఒక కొత్త టీకాను తయారు చేశారు.

ఈ టీకా రక్తంలోని ఇన్సులిన్‌ స్థాయిలను పడిపోకుండా చూడటమే కాకుండా కొందరిలో ఇన్సులిన్‌ మోతాదులు పెరిగేలా కూడా చేస్తున్నట్టు వారు కనుగొన్నారు. ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించని ఈ కొత్త టీకాను తీసుకున్న వారిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలు దెబ్బతినడం తగ్గుముఖం పట్టినట్టు తమ అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ విషయాలను గురించి స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ లారెన్స్‌ స్టీన్‌మ్యాన్‌ మాట్లాడుతూ, కొత్తరకం టీకాకు సంబంధించిన ఫలితాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయని, ఈ టీకాతో మొత్తం రోగనిరోధక వ్యవస్థను ముట్టుకోకుండా కేవలం ఎంపిక చేసిన కొన్ని రోగనిరోధక కణాలను మాత్రమే పనిచేయకుండా ఆపేయటం సాధ్యమవుతోందని వివరించారు. ఇప్పటి వరకూ మనుషులకు ఇవ్వడానికి ఎలాంటి డిఎన్‌ఏ టీకాను అనుమతించలేదని, అయితే ఇలాంటి వాటిని అనుమతించడానికి ఇంకా చాలాకాలం పట్టవచ్చని ఆయన తెలిపారు. పుట్టుకతో వచ్చే మధుమేహాన్ని ఎదుర్కొనడానికి ఇలాంటి డిఎన్‌ఏ టీకాను రూపొందించడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News