: భారత ఎంపీల చలో అమెరికా
భారత ఎంపీలు ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయంలో స్వల్పకాలిక క్రాష్ కోర్సులో పాల్గొన్నారు. మొత్తం 11 మందితో కూడిన భారత ఎంపీల బృందం జూన్ 19న అమెరికా బయల్దేరి వెళ్ళింది. కనెక్టికట్ లోని యేల్ యూనివర్శిటీ క్యాంపస్ లో ఆరు రోజుల పాటు జరిగే ఈ షార్ట్ టెర్మ్ కోర్సులో నాయకత్వ పటిమపై ఎంపీలకు శిక్షణ ఇవ్వనున్నారు. దాంతోపాటే, రాజకీయ, ఆర్ధిక, వాణిజ్య అంశాల్లోనూ తర్ఫీదు పొందనున్నారు. క్లాస్ రూముల్లోనే కాకుండా.. న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్, ఐరాస భద్రతమండలి, న్యూయార్క్ టైమ్స్ పత్రిక కార్యాలయాలను సందర్శించి పలు సందేహాలను నివృత్తి చేసుకుంటారు. కాగా, అన్ని పార్టీలకు చెందిన ఈ ఎంపీల బృందంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సి.ఎం. రమేశ్ కూడా ఉన్నారు.