: హమ్మయ్య.. కరెంటు ఖాతా లోటు తగ్గింది
కేంద్ర ప్రభుత్వం, పారిశ్రామిక వేత్తలు ఊపిరి పీల్చుకునేలా కరెంట్ ఖాతా లోటు భారీగా దిగివచ్చింది. ఈ ఏడాది జనవరి - మార్చి త్రైమాసిక కాలంలో దేశ కరెంట్ ఖాతా లోటు 3.6శాతానికి తగ్గింది. ఇది అంతకుముందు త్రైమాసికం(అక్టోబర్ - డిసెంబర్)లో 6.7గా ఉంది. ఈ లెక్కన చూస్తే లోటు తగ్గడం ప్రభుత్వానికి ఉపశమనంగా భావించవచ్చు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం 2012-13లో కరెంట్ ఖాతా లోటు 4.8 శాతంగా ఉంది. డాలర్ బలానికి రూపాయి బక్కచిక్కుతూ, విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెనక్కి మళ్లుతున్న కీలక సమయంలో కరెంట్ ఖాతా లోటు తగ్గడం కాస్త మేలు చేసేదే. స్వల్పకాలంలో రూపాయి క్షీణతకు అడ్డకట్ట పడొచ్చని భావిస్తున్నారు.
వాస్తవానికి బంగారం దిగుమతులు అంతకంతకూ పెరిగిపోతుండడం ప్రధానంగా కరెంట్ ఖాతా లోటు పెరగడానికి కారణంగా ఉంటోంది. విదేశీ మారకద్రవ్యం రాకపోకల్లో తేడానే కరెంట్ ఖాతా లోటుగా వ్యవహరిస్తారు. మన దేశానికి వస్తున్న నిధులు, దేశం నుంచి వెళుతున్న నిధుల్లో తేడా అన్నమాట. బంగారం దిగుమతులు డాలర్లలో కొనసాగుతాయి. దీంతో ఎక్కువ మొత్తంలో డాలర్లకు డిమాండ్ ఏర్పడుతుండడంతో రూపాయి విలువ క్షీణిస్తోంది. దీనికి తోడు ఇతరత్రా దిగుమతులు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. దీంతో బంగారం దిగుమతులు తగ్గించేందుకు గత కొన్ని నెలలుగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అదే సమయంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికీ నిర్ణయాలను తీసుకుంది.