: విగ్రహాన్ని తొలగించడంవల్లే విపత్తు: ఉత్తరాఖండ్ స్థానికుల నమ్మకం
అది ఉత్తరాఖండ్ లోని శ్రీనగర్ ప్రాంతం. హిమాలయాల్లో పుట్టి ప్రవహించే అలకనందా నది అటుగానే ప్రవహిస్తోంది. ఈ నది మధ్యలో ధారీ దేవి విగ్రహం 800 ఏళ్లుగా కొలువై ఉంది. ఈ అమ్మవారు అంటే స్థానికుల్లో ఎంతో నమ్మకం, విశ్వాసం. అయితే జల విద్యుత్ ప్రాజెక్టుకు అడ్డుగా ఉందంటూ ఒక ప్రైవేటు కంపెనీ(రాష్టానికి చెందిన జీవీకే కంపెనీగా ప్రచారం) అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి మరో చోటకు తరలించాలని యత్నించింది. స్థానికులు ఆందోళనకు దిగడంతో కొన్ని రోజులపాటు ఆగిపోయింది. కానీ, ఉన్నట్లుండి సదరు కంపెనీ ఒక రోజు ధారీ దేవి విగ్రహాన్ని అక్కడి నుంచి ఎత్తయిన మరో ప్రాంతానికి తరలించింది. అదే రోజు ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదలతో పెను విపత్తు సంభవించింది. దీనికి అమ్మవారి విగ్రహం తొలగించడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అమ్మవారి విగ్రహం నది మధ్యలో ఉండడం వల్ల ఎంతటి ప్రవాహం అయినా అదుపులో ఉండేదని అంటున్నారు.
పర్యావరణ నిపుణులు మాత్రం, జల విద్యుత్ ప్రాజెక్టులు పెరిగిపోవడంతో, నదీ ప్రవాహాలకు ఆటంకాలు ఏర్పడ్డాయని, ఒక్కసారిగా భారీ వర్షంతో కట్టలు తెగడం వల్లే ప్రళయం సంభవించిందని విశ్లేషిస్తున్నారు.