: 'తెలంగాణ' తుపాను తీరం చేరనుందా?


ఉద్యమం అంటేనే పోరాటం. పోరాటం పరాకాష్ఠకు చేరిననాడు అది విప్లవరూపం దాల్చుతుంది. అప్పుడు చెలరేగే ఆవేశకాగ్నికీలలను ఆర్పజాలడం ఎవరితరమూకాదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తెలియని విషయం కాదిది. ఆమె స్వతహాగా ఇటాలియన్ అయినా.. భారతీయ భాషలు పరాయివైనా.. భావం అందిపుచ్చుకోవడానికి అదేమీ అడ్డంకి కాదుగా. ఎన్నో ఏళ్ళుగా నలుగుతున్న తెలంగాణ విషయాన్ని ఇక తేల్చేయడమే మంచిదని.. మనోభావాలతో ఆడుకోవాలని చూస్తే, అవి, తిరగబడి వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తాయని మేడమ్ గ్రహించినట్టుంది. అందుకే, హస్తినలో మంతనాలకు తెరదీసింది.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరితో వంతులవారీగా అభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. తెలంగాణ, రాయలసీమలను కలిపి రాయల్ తెలంగాణ అని ప్రత్యేక రాష్ట్ర వాదులకు.. స్పెషల్ ప్యాకేజి అని సీమాంధ్రులకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్దిరోజుల్లో కేంద్రం నుంచి తీవ్ర నిర్ణయమే ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ వంటి పార్టీలు ప్రత్యేక తెలంగాణ తప్ప మరోటి అంగీకరించబోమని స్పష్టం చేస్తుండగా.. రాయల్ తెలంగాణ ప్రతిపాదన ఊహాగానం తప్ప మరేమీ కాదని గంటా శ్రీనివాసరావు వంటి సీమాంధ్ర మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా సమైక్యవాదానికే తమ మద్దతంటూ ప్రజల మెప్పు పొందేందుకు యత్నిస్తున్నారు.

అసలు.. ఇంతటి సువిశాల రాష్ట్రం విడిపోవాలంటూ ఉద్యమాలు ఎగిసిపడడానికి గల కారణాలను ఓసారి పరికిస్తే.. 1956లో హైదరాబాద్ సంస్థానాన్ని ఆంధ్రలో విలీనం చేయగా అది ఆంధ్రప్రదేశ్ అయింది. విచిత్రమేమిటంటే.. ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఉండగా.. అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రాంతం ఓ భాగంగా ఉండేది. ఏమైతేనేం, కొన్ని రాజకీయాలు, మరికొన్ని ఒప్పందాలు తెలుగు మాట్లాడేవాళ్ళందరినీ ఒకే రాష్ట్రం పరిధిలోకి తెచ్చాయి.

కానీ, ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ ధిక్కారం మొలకెత్తుతుంది. అది ఆకులు తొడిగి, వేళ్ళూనుకుని, మహావృక్షంలా రూపుదాల్చిననాడు తిరుగుబాటు తప్పదు. తెలంగాణ విషయంలో జరిగిందిదే. తొలినాళ్ళలో నిజాం పాలకులు, వారి తొత్తులైన రజాకార్ల దమనకాండ.. ఆనక భూస్వామ్య వ్యవస్థ దుష్ఫలితాలు తెలంగాణలో పోరుబీజాలు నాటాయి. ప్రత్యేక రాష్ట్రంతోనే తమకు ప్రశాంతత చేకూరుతుందని బలంగా నమ్మిన ఇక్కడి యువత 1969, 1972లో భారీ ఎత్తున ఉద్యమించింది. ఆ ఫలితాలు ఎలా ఉన్నా 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడన్నది నిర్వివాదాంశం.

అమ్ముడుపోయాడని, ఉద్యమాన్ని తాకట్టుపెట్టి కోట్లు కొల్లగొట్టాడని కేసీఆర్ పై ఆరోపణలు వచ్చినా.. ప్రజల రక్తాన్ని మరిగించి ప్రత్యేక జ్వాల రగిలించడం ఆయన చలవే. ఇప్పుడు ఎన్నికల కాలం సమీపిస్తోంది. పార్టీలన్న తర్వాత ఓటు బ్యాంకులే కదా ముఖ్యం. రాయల్ తెలంగాణ అయితే.. అటు జగన్ కు చెక్ పెట్టొచ్చు.. ఇటు సీమాంధ్రలో చంద్రబాబుతో ఢీకొట్టొచ్చన్నది కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహంలా కనబడుతోంది. అప్పుడు మొత్తం 42 పార్లమెంటు సీట్లలో అటు 21 ఇటు 21గా చీలిపోతాయి. తద్వారా.. రెండుచోట్లా తమ ప్రాబల్యం తగ్గనీయకుండా కాపాడుకోవచ్చన్నది సోనియా అండ్ కో భావన.

కానీ.. వందలాది విద్యార్థుల ప్రాణత్యాగం, ఎందరో ఉద్యమకారుల జీవిత బలిదానాల ఏకైక లక్ష్యమైన 'ప్రత్యేక తెలంగాణ' భవిష్యత్, రాజకీయ నిర్ణేతల చేతుల్లో ఉండడం విచారించాల్సిన అంశం. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని ఆనాడు దాశరథి అన్నా.. 'జయ జయహే తెలంగాణ, జననీ జయకేతనం' అని నేటి కవి అందెశ్రీ గానం చేసినా.. అది దశాబ్దాలుగా పోరుబాటన సాగుతోన్న వీరతెలంగాణ కోసమే. అంతటి సాంస్కృతిక ఘన వారసత్వం ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పెద్దల రాజకీయ జూదంలో మరోసారి పావులా మారుతుందో.. ఆంధ్ర నుంచి విడివడి వేరు కుంపటి వెలిగించుకుంటుందో కాలమే చెప్పాలి.

  • Loading...

More Telugu News