: చెన్నైకార్పోరేషన్ 'చెత్త' అవినీతి!
కాదేదీ అవినీతికనర్హం అన్నట్టు చెన్నై కార్పోరేషన్ 'చెత్త డబ్బా'ల్లో కూడా అవినీతికి పాల్పడింది. కేవలం వెయ్యిరూపాయల విలువ చేసే డబ్బాలకు లక్షలు చెల్లించినట్టు లెక్కల్లో చూపారు అక్కడి అధికారులు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కార్యకర్త చొరవతో వెలికి వచ్చిన అవినీతి వివరాల్లోకి వెళితే... చెన్నై కార్పోరేషన్ కు చెందిన కొన్ని ఏరియాల్లో లక్ష రూపాయలకు పైగా వెచ్చించి పర్యావరణాన్ని పరిరక్షించే బ్లూ 'గ్రూప్ గార్బెజ్ బిన్స్' ఏర్పాటు చేసినట్టు కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
అంతేకాకుండా మాధవరంలో ఏర్పాటు చేసిన 20 గ్రూప్ చెత్తడబ్బాలకు ఒక్కోదానికి లక్షా 15 వేల రూపాయల చొప్పున 23.08 లక్షల రూపాయలు వెచ్చించినట్టు లెక్కలు రాసేశారు. తొండియార్ పేట్ లో 102 గ్రూప్ చెత్త డబ్బాలకు కోటీ 11 లక్షల రూపాయలు వెచ్చించినట్టు లెక్కతేల్చారు. అంటే ఒక్కో చెత్త డబ్బాకు లక్షా ఎనిమిది వేల రూపాయలు ఖర్చుచేశారన్న మాట.
అయితే, ఈ చెత్తడబ్బాలను కేవలం వెయ్యిరూపాయలకే ఏర్పాటు చేయవచ్చని ఓ స్వచ్చంద సంస్థ ప్రకటించడంతో అధికారుల అవినీతి బట్టబయలైంది. దీంతో చెన్నై కార్పొరేషన్ అధికారులా మజాకా అని అక్కడి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.