: ఐటీ కంపెనీల నోట్లో పచ్చి వెలక్కాయ
భారత ఐటీ కంపెనీల అభ్యర్థనలు ఫలించలేదు. వాటి ఆందోళనను పట్టించుకోలేదు. అమెరికా సెనేటర్లు కఠిన నిబంధనలతో కూడిన వలసవాద సంస్కరణల బిల్లుకు ఆమోదముద్ర వేశారు. సెనేట్ లో బిల్లుకు అనుకూలంగా 67 ఓట్లు, వ్యతిరేకంగా 27 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ప్రతినిధుల సభ ముందుకు వెళుతుంది. అనంతరం బిల్లుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇవన్నీ లాంఛనప్రాయమే.
ఈ బిల్లులో హెచ్1బీ వీసాల సంఖ్యను పెంచుతూనే భారతీయ ఐటీ నిపుణులు, ఐటీ కంపెనీలకు ఎసరు పెట్టారు. భారత ఐటీ కంపెనీలు ఎక్కువ మంది నిపుణులను అమెరికాకు తీసుకురాకుండా నియంత్రణలు ఈ బిల్లులో ఉన్నాయి. పరిమితికి మించి ఉంటే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఏటా ఇంత శాతం చొప్పున 2016 నాటికి విదేశీ నిపుణులను 50శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా పలు ఆంక్షలు కూడా ఉన్నాయి. అంతిమంగా ఈ బిల్లు భారత ఐటీ కంపెనీలకు ఉరితాడు అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.