: మార్కెట్ లోకి సరికొత్త కేటీఎం డ్యూక్ 390 బజాజ్ బైక్
బజాజ్ ఆటో లిమిటెడ్(బీఏఎల్) కేటీఎం ఫోర్ట్ ఫోలియోలో మరో ఖరీదైన బైక్ కేటీఎం డ్యూక్ 390 ని మార్కెట్ లోకి విడుదల చేసింది. పూణేలోని బజాజ్ షోరూంలో విడుదల చేసిన ఈ మోడల్ ధర 1.8 లక్షలుగా నిర్ణయించింది. గతేడాది జనవరిలో కేటీఎం 200 డ్యూక్ ను బజాజ్ ప్రవేశపెట్టింది. అప్పటినుంచి ఇప్పటి వరకు మొత్తం 11,000 బైక్ లను బజాజ్ కంపెనీ విక్రయించింది. ఇందులో 7,500 బైక్ లను ఈ ఆర్ధిక సంవత్సరంలోనే విక్రయించినట్టు ఆ సంస్థ తెలిపింది.
మరో వైపు తమ కంపెనీ 25 వేల నుంచి 30 వేల కేటీఎం బైక్ లను ఈ ఏడాది ఐరోపా విపణిలోకి ఎగుమతి చేస్తున్నట్టు తెలిపింది. కొత్త బైక్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో ఈసారి అత్యధిక అమ్మకాలను నమోదు చేసే అవకాశముందని బజాజ్ కంపెనీ ఉపాధ్యక్షుడు అమిత్ నంది తెలిపారు. వచ్చే ఏడాది మరో కేటీఎం బైక్ ను మార్కెట్ లోకి తెచ్చే అవకాశముంది. అయితే అది ఎప్పుడు అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.