: హెలీకాప్టర్ కూలి 19 మంది మృతి
బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి దుర్మరణం పాలయ్యారు వాయుసేన సిబ్బంది. ఉత్తరాఖండ్ వరదబాధితులను రక్షించేందుకు సహాయక చర్యల్లో పాల్గొని తిరిగి వస్తూ వాయుసేన హెలీకాప్టర్ ఎంఐ 17 గౌరీకుండ్ వద్ద కూలిపోయింది. అందులోని ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఐదుగురితో పాటు 12 మంది పౌరులు మృతి చెందినట్టు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం సహకరించకపోవడంతో ఈ హెలీకాప్టర్ కూలిందని జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో మృతి చెందిన 8 మందిని వెలికి తీసినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదం వార్త విన్న ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.