: మూలాలనే మరచిన బీసీసీఐ


క్రికెట్ భారతీయుల ఆశ, శ్వాసగా మారిన క్రీడ. జాతీయ క్రీడ హాకీయే అయినప్పటికీ అమిత ప్రేక్షకాదరణతో భారతజాతీయ అనధికార క్రీడగా క్రికెట్ వర్ధిల్లుతోంది. సరిగ్గా నేటికి 30 ఏళ్ల క్రితం క్రికెట్ భారత దేశంలో ఈ స్థాయిలో వర్ధిల్లడానికి బీజం పడింది. 25 జూన్ 1983 న కపిల్ డెవిల్స్ టీం ప్రపంచకప్ ను సాధించిన రోజు ఈ రోజు. అయితే అందుకు కృతజ్ఞత ఏదీ? బీసీసీఐ కపిల్ డెవిల్స్ ను సముచిత రీతిన సత్కరించిందా? అన్న ప్రశ్నకు లేదనే సమాధానం వినిపిస్తుంది. తన వాపును చూసి బలుపనుకుంటున్నట్టుంది బీసీసీఐ అధికారుల తీరు.

బీసీసీఐ నేడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థ. దీనికి, ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రతి దేశంలోని క్రికెట్ బోర్డులు దేశ పాలకుల చేతుల్లో ఉండే సంస్థలే. అయితే బీసీసీఐ మాత్రం భిన్నం. ప్రభుత్వానికి, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు సంబంధం లేదు. కనీసం ఈ బోర్డులో ఆటగాళ్లు సభ్యులుగా ఉండరు. ఆటతో ఏ సంబంధం లేని వ్యాపారవేత్తలు సంస్ధను నడిపించే నిపుణుల అవతారమెత్తుతారు. ఇది ఒక కోణం!

తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన ఆటగాళ్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నజరానా ప్రకటించింది బీసీసీఐ. మరి నిపుణులకు 30 లక్షల చొప్పున ప్రకటించి బీసీసీఐ వితరణ చాటుకుంది. వేల కోట్ల ఖజానా మూల్గుతున్న బీసీసీఐ అసలు క్రికెట్ అనే ఫీవర్ పట్టించిన కపిల్ డెవిల్స్ ను ఎందుకు విస్మరించింది? వారి సేవలను ఎందుకు చిన్నచూపు చూస్తోంది? అన్నది సమాధానం దొరకని ప్రశ్నలు. లేక కొంత మంది చెప్పినట్టు డబ్బు తెచ్చేవారిని తప్ప మిగతా వార్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటోందా?

ఇంత డబ్బు బీసీసీకి రావడానికి ప్రపంచం గర్వించే భారతీయ క్రీడాకారుల్ని అందించిన ఘనత ఒక రకంగా కపిల్ డెవిల్స్ దే. ఎందుకంటే అప్పటికి అనామక జట్టుగా టోర్నీలో అడుగుపెట్టి అరివీరభయంకర వెస్టిండీస్ జట్టును ఢీకోట్టి గెలవడమంటే మాటలు కాదు. ఆనాటి ఆ విజయం నింపిన స్ఫూర్తి చిహ్నమే నేటి క్రికెట్ పేరు ప్రతిష్టలు, ప్రపంచం గర్వించదగ్గ ఆటగాళ్లు. దీంతో ఇకనైనా బీసీసీఐ ముందు మూలాలను మరచి రెమ్మలను, కొమ్మలను పట్టుకు వేలాడకుండా సీనియర్లను గుర్తించి సత్కరించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగానన్నా గుర్తిస్తుందని ఆశిద్దాం.

  • Loading...

More Telugu News