: అనామకుడి చేతిలో నాదల్ చిత్తు
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో పెను సంచలనం నమోదైంది. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకుని, ఎవరికీ సాధ్యంకాని విధంగా ఎనిమిది సార్లు ఆ టైటిల్ గెలుచుకున్న రికార్డు తన పేరిట లిఖించుకున్న నాదల్, ఇప్పుడు ఊరూ పేరూ లేని ఆటగాడి చేతిలో ఓడి, అప్రదిష్ట మూటగట్టుకున్నాడు. దీంతో నమ్మశక్యం కాని రీతిలో తొలి రౌండ్ లోనే వెనుదిరిగాడు. బెల్జియంకు చెందిన స్టీవ్ డార్సిస్ ప్రపంచ 135వ ర్యాంకర్. నాకౌట్ దశలో నాదల్ తో డార్సిస్ కి డ్రా తగిలింది.
అభిమానులంతా డార్సిస్ చిత్తౌతాడని, నాదల్ దెబ్బకు ఎటుకొట్టుకుపోతాడోనని పలు రకాల అంచనాలతో మైదానంలోకి అడుగుపెట్టి పెనుసంచలనం చూసి సంభ్రమశ్చర్యాలకు గురయ్యారు. డార్సిస్ 7-6, 7-6, 6-4 స్కోరుతో ప్రపంచ ఐదో ర్యాంకర్ రఫేల్ నాదల్ ను చిత్తు చేశాడు. దీంతో 35 గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 12 టైటిల్స్ నెగ్గిన నాదల్ తొలి రౌండ్ లోనే అవమానకర రీతిలో వెనుదిరిగాడు. డార్సిస్ మాత్రం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుని చరిత్ర సృష్టించాడు.