: 3జీ ధరలకే ఎయిర్ టెల్ 4జీ బ్రాడ్ బ్యాండ్
ఎయిర్ టెల్ మరోసారి ధరల యుద్ధానికి తెరతీసింది. 4జీ బ్రాడ్ బ్రాండ్ ను 3జీ ధరలకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పంజాబ్, హర్యానా సర్కిళ్లలో 2జీ డేటా చార్జీలను 90 శాతం తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించిన ఎయిర్ టెల్ తాజాగా 4జీ విషయంలోనూ ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. కోల్ కతా, పుణె, బెంగళూరు, ఛండీగఢ్ సర్కిళ్లలో 4జీ వేగంతో 2జీబీ డేటాను రూ.450కు, 3జీబీ డేటాను 650కు, 4జీబీ డేటాను రూ.750కు అందిస్తున్నట్లు ప్రకటించినట్లు సీఎన్బీసీ టీవీ 18 పేర్కొంది. మరి దేశవ్యాప్తంగా 4జీ సర్వీసుల లైసెన్స్ ను పొందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్(ముఖేశ్ అంబానీకి చెందినది) ఇంకా సర్వీసులు ప్రారంభించలేదు. దీంతో ఈ కంపెనీ ఎయిర్ టెల్ కు సవాల్ విసరాలంటే ఇంకా తక్కువరేట్లతో మార్కెట్లోకి అడుగు పెట్టాల్సిందే. అదే జరిగితే సూపర్ ఫాస్ట్ నెట్ వినియోగదారులకు చౌకగానే లభించడం ఖాయం.