: కేదార్ నాథ్ లో మృతులకు నేడు అంత్యక్రియలు
వరద విపత్తులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారికి నేడు కేదార్ నాథ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. సుమారు 1000 మృతదేహాలను కేదార్ నాథ్ లో వెలికితీసిన సంగతి తెలిసిందే. వీటిని సామూహికంగా దహనం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణం సహకరిస్తే నేడే దహన కార్యక్రమం పూర్తవుతుందని ఉత్తరాఖండ్ అధికారి ఒకరు తెలిపారు. అంత్యక్రియల కోసం 50 టన్నుల కలప, నెయ్యి సమకూర్చుకోవాలని స్థానిక అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. వరదలు వచ్చి వారం రోజులు గడవడం, మృతదేహాలు కుళ్లి పోయినందున ఆలస్యం చేస్తే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందంటూ స్థానికుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో వెంటనే అంత్యక్రియలు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.