: ఈర్ష్యను గుర్తించవచ్చు
మన భావోద్వేగాలను పసిగట్టడం కష్టం. మనలో ఎప్పుడు ఎలాంటి భావాలు వ్యక్తమవుతాయో ఎదుటివారు తెలుసుకోవడం కష్టం. అయితే మనలోని భావోద్వేగాలను ఇట్టే పసిగట్టవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న స్కానర్ ద్వారా మనలోని ఆనందం, విషాదం, ఆగ్రహంతోబాటు ఈర్ష్యను కూడా ఇట్టే గుర్తించవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం వారు మొదటిసారిగా మెదడు స్కానర్లను ఉపయోగించారు.
కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఫంక్షనల్ మాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్‌ఎంఆర్‌ఐ), మెదడు సంకేతాలను కొలిచే పరికరాలను ఉపయోగించి ఈ విషయాలను కనుగొన్నారు. మన మెదడు భావాలను ఎలా వర్గీకరిస్తుందనే విషయాన్ని దీని ద్వారా వారు తెలియజేశారు. ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు సుమారు పదిమంది డ్రామా కళాకారులకు ఆగ్రహం, ఈర్ష్య, భయం, ఆనందం వంటి తొమ్మిది రకాలైన భావోద్వేగాల పదాలను చూపారు. ఆ సమయంలో వారి మెదడు స్కాన్ చేశారు. ఇలా మెదడు స్కానరులో ఉండగా ఈ భావోద్వేగ దశల్లోకి అనేకసార్లు వెళ్లాల్సిందిగా వారు కళాకారులకు సూచించారు. ఆ సమయంలో వారి మెదడు సంకేతాల ఆధారంగా ఒక కంప్యూటరు నమూనాను తయారు చేసి ఆయా భావోద్వేగాలకు సంబంధించి మెదడు ప్రతిఫలించే తీరును వారు నమోదు చేశారు.