: భూమికన్నా ముందే అక్కడ ఎక్కువ ఆక్సిజన్
భూమిపై ఆక్సిజన్‌తో కూడిన వాతావరణం సుమారు 2500 మిలియన్ సంవత్సరాల నుండి ఏర్పడి ఉండవచ్చు. అయితే సుమారు నాలుగువేల మిలియన్ సంవత్సరాల క్రితమే అరుణగ్రహంపై అత్యధిక మోతాదులో ఆక్సిజన్ ఉండేదట. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు భూమిపై లభించిన అరుణ గ్రహానికి సంబంధించిన చిన్న ఉల్కను పరిశీలించగా తేలిన సమాచారాన్ని, అలాగే నాసా అరుణగ్రహంపైకి పంపిన స్పిరిట్ రోవర్ అక్కడి ఉపరితలంపై ఉన్న రాళ్లను పరిశీలించగా తేలిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చారు.
అరుణగ్రహం ఉపరితలంపై ఉన్న రాళ్ళు ఐదురెట్లు నికెల్‌ను కలిగి ఉన్నాయట. అలాగే చిన్న ఉల్కలుగా భావిస్తున్న రాళ్లు అరుణగ్రహంపై ఉన్న అగ్నిపర్వతం పేలుడు వల్ల ఎగిసిపడి ఉంటాయి. అరుణగ్రహంపై ఉన్న చిన్న చిన్న రాళ్లు, అలాగే అగ్ని పర్వతం పేలుడు వల్ల పడిన చిన్న రాళ్లను పరిశీలించిన తర్వాత ఉపరితలంపై ఉన్న రాళ్లు ఎక్కువ ఆక్సిజన్ కలిగివున్న వాతావరణానికి సంబంధించినట్టు తెలుస్తున్నట్టు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు బెర్నార్డ్ వుడ్ చెబుతున్నారు. భూమిపై లభించిన ఉల్క శిలలకు సుమారు 180 నుండి 1400 మిలియన్ సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని, అయితే ప్రస్తుతం స్పిరిట్ రోవర్ పరిశోధనలు నిర్వహిస్తున్న ప్రాంతం సుమారు 3700 మిలియన్ సంవత్సరాలను కలిగివున్న శిలలతో కూడివుందని వుడ్ చెబుతున్నారు.