: రేపు ఉత్తరాఖండ్ కు చంద్రబాబు
అమెరికా పర్యటన నుంచి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు రేపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న తెలుగు వారిని రాష్టానికి తరలించడానికి తీసుకున్న చర్యలపై ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాఖండ్ లో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
రక్షించిన వారిని రైళ్లలో కాకుండా ప్రత్యేక విమానంలో తరలించవచ్చు కదా? అని ప్రశ్నించారు. మొత్తం 12 వేల మంది యాత్రీకులు ఉత్తరాఖండ్ కు వెళితే చాలా మంది ఆచూకీ లభించడంలేదన్నారు. అసలిప్పటి వరకూ ఎంతమంది మరణించారో, ఎంత మంది గల్లంతయ్యారో అధికారికంగా ప్రకటించలేదన్నారు. మరణించినవారి కుటుంబ సభ్యులకు 10లక్షల రూపాయలు పరిహారంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సాయంత్రం ఏపీ భవన్ కు వెళ్లి అక్కడ వసతి పొందుతున్న బాధిత యాత్రీకులను పరామర్శిస్తారు. రాత్రికి ఢిల్లీలోనే బసచేసి రేపు ఉదయం ఉత్తరాఖండ్ కు ప్రయాణమవుతారు.