: ఐఐటీ అర్హత పరీక్షలో 13 ఏళ్ల బాలుడి విజయఢంకా
తాజాగా విడుదలైన ఐఐటీ-జేఈఈ పరీక్షా ఫలితాల్లో విజయఢంకా మోగించిన ఓ విద్యార్ధి అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. కారణం ఏమిటంటే, ఆ కుర్రాడి వయసు కేవలం 13 ఏళ్ళు మాత్రమే! ఈ పరీక్ష రాసిన లక్షా ఏభై వేల మంది విద్యార్ధుల్లో 679 ర్యాంకుతో ఆ బాలుడు రికార్డు కొట్టాడు. బీహార్ రైతు కుటుంబంలో పుట్టిన ఆ విద్యార్ధి పేరు సత్యమ్ కుమార్. గత సంవత్సరం ఇంటర్ పూర్తిచేసిన ఈ కుర్రాడు ఈసారి ఐఐటీ అడ్మిషన్ పొందుతున్నాడు. తమ కుమారుడు ఇంత చిన్న వయసులోనే ఇలాంటిది సాధించడం గర్వకారణంగా ఉందని సత్యం తండ్రి సిద్ధాంత్ సింగ్ ఓ వార్తా ఏజెన్సీ ఎదుట సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, ఐఐటీ-జేఈఈ రికార్డు ప్రకారం అత్యంత పిన్న వయసులో ఈ పరీక్ష పాసైన విద్యార్ధిగా సత్యం రికార్డు సృష్టించాడు. బీహార్ లోని భోజ్ పుర్ జిల్లా బకోరాపుర్ గ్రామానికి చెందిన సత్యం.. సీబీఎస్ఈ పర్మిషన్ తో గత ఏడాది 12 సంవత్సరాలకే ఐఐటి రాసేందుకు అర్హత పొందాడు. అప్పుడు ఆల్ ఇండియా వారీగా 8,137 ర్యాంకును పొందాడు. దాంతో, సంతృప్తి చెందని అతను మళ్లీ ఈ సంవత్సరం రాసి, మంచి ర్యాంకును దక్కించుకున్నాడు. ఫేస్ బుక్ స్పూర్తితో ఓ సాఫ్ట్ వేర్ సంస్థను నెలకొల్పడమే తన లక్ష్యమని సత్యం వెల్లడించాడు.