: భార్యను కడతేర్చమని స్టూడెంట్ ను పురమాయించిన ప్రిన్సిపాల్
ముంబయిలో దారుణం జరిగింది. ఓ మహిళ పాలిట ఆమె భర్తే యముడయ్యాడు. నగరంలోని నలసోపారా ప్రాంతంలోని ఠాకూర్ విద్యామందిర్ పాఠశాలకు అమర్జీత్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే, తనను నిత్యం అనుమానించే భార్య కిరణ్ ను అడ్డుతొలగించుకోవాలని భావించాడు. ఇందుకు తన పూర్వ విద్యార్థి అక్బరాలీని రంగంలోకి దింపాడు. తన భార్యను చంపితే రూ.50 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ముందే వేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం అమర్జీత్ భార్య కిరణ్ ను పాఠశాలకు పిలిచాడు. తనను ఆశ్చర్యపరుస్తానని చెప్పాడు. భర్త మాటలను అమాయకంగా నమ్మిన ఆ ఇల్లాలు అక్కడికి వచ్చింది. అక్కడే కాచుకుని ఉన్న అక్బరాలీ ఆమెకు క్లోరోఫాం వాసన చూపి సృహకోల్పోయిన తర్వాత ఆమె తలను కత్తితో వేరు చేశాడు. అనంతరం శరీరాన్ని ముక్కలుగా చేసి వాటిని ఓ గోనెసంచిలో వేసుకుని ముంబయి శివారు ప్రాంతమైన గావ్రిపడాలో విసిరేశారు.
ఆమె తల భాగం కొందరు స్థానికుల కంటబడడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, అంతకుముందే అమర్జీత్ తన భార్య కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడు. ఆమె తలను అతనికి చూపడంతో తన భార్యే అని తెలిపాడు. ఆమె ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటుందని, ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అమర్జీత్ పోలీసులతో చెప్పాడు. కానీ, పోలీసులకు అనుమానమొచ్చి అమర్జీత్ పై నిఘా పెట్టారు. అమర్జీత్ ఫోన్ కాల్స్ ను పరిశీలించగా.. అక్బరాలీ నుంచి పెద్ద సంఖ్యలో కాల్స్ కనిపించాయి. దీంతో, తమదైన శైలిలో విచారించగా నిజాలు బయటపెట్టాడీ టీచర్ ప్రబుద్ధుడు. స్టూడెంట్లతో తనకు ఎఫైర్లు ఉన్నట్టు తన భార్య నిత్యం సతాయిస్తోందని, ఫోన్ ను తరచూ చెక్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని.. అందుకే ఆమెను అడ్డుతొలగించుకోవాలని పథకం వేశానని చెప్పాడు అమర్జీత్. ఈ దుష్ట ప్రిన్సిపాల్ కు సహకరించిన అక్బరాలీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.