: భారత షూటర్లు మన అమ్మాయికే గురిపెట్టారు!
ఇటీవల కాలంలో విశేషంగా రాణిస్తూ.. భారత్ పేరును అంతర్జాతీయ యవనికపై విజయవంతంగా చాటుతున్న మన షూటర్లు.. తాజాగా తమ ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే జర్మనీలో జరిగిన షూటింగ్ ఈవెంట్ లో భారీగా పతకాలు కొల్లగొట్టిన మన జట్టులో లైంగిక వేధింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. జట్టులోని ఓ మహిళా షూటర్ తన పట్ల ఇద్దరు యువ షూటర్లు లైంగింక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఆరోపణలు నిజమే అని కోచ్ కూడా నిర్దారించారు. ఆ ఇద్దరూ ఆమె షూటింగ్ పోటీలో పాల్గొంటున్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టారని తెలిపారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) ఆ ఇద్దరు ట్రాప్ షూటర్లను సస్పెండ్ చేసింది. జర్మనీలో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ లో 2 స్వర్ణాలతో సహా మొత్తం 8 పతకాలతో భారత్ ప్రతిష్ఠ ఇనుమడించగా.. తాజా విపరీత ఘటన కారణంగా ఆ ఖ్యాతి మసకబారింది.
ఈ వ్యవహారంపై ఎన్ఆర్ఏఐ కార్యదర్శి రాజీవ్ భాటియా మాట్లాడుతూ, ఆ ట్రాప్ షూటర్లిద్దరూ మైనర్లని.. వారిని ఫిన్లాండ్ లో జరిగే జూనియర్ షూటింగ్ చాంపియన్ షిప్ కు ఎంపిక చేయడంలేదని తెలిపారు. కాగా, ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రాణిందర్ సింగ్ వీరిద్దరిపై జాతీయ అథ్లెటిక్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మరికొద్ది రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది.