: ఐసీసీ సమావేశానికి నేనే వెళతా: దాల్మియా స్పష్టీకరణ
అల్లుడి బెట్టింగ్ నిర్వాకం కారణంగా బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరమైన ఎన్. శ్రీనివాసన్ కు సన్నిహితుడైన జగ్ మోహన్ దాల్మియా నుంచి ఝలక్ ఎదురైంది. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన జగ్ మోహన్ దాల్మియా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశానికి తానే హాజరవుతానని స్పష్టం చేశారు. శ్రీనివాసన్ ఆ భేటీకి వస్తారో రారో తనకు తెలియదన్నాడు. కొద్దిరోజుల క్రితం శ్రీనివాసన్ మీడియాతో మాట్లాడుతూ, లండన్ లో ఈ నెల 27,28,29 తేదీల్లో జరిగే ఐసీసీ మీటింగ్ కు తాను వెళతానని అన్నారు. అప్పుడు మౌనంగానే ఉన్న దాల్మియా నేడు శ్రీనివాసన్ కు షాకిచ్చారు.
'మీతోపాటు లండన్ ఎవరు వస్తున్నారు?' అని మీడియా ప్రశ్నించగా.. బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వస్తున్నారని దాల్మియా బదులిచ్చారు. తాజా పరిణామాలు చూస్తుంటే బోర్డుపై మెల్లమెల్లగా దాల్మియా తన పట్టు బిగిస్తున్నట్టు అర్థం అవుతోంది. తద్వారా నిదానంగానైనా శ్రీనివాసన్ శకానికి అంతం పలకాలని బోర్డులోని కొన్నివర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. కాగా, ఐసీసీ సమావేశాల్లో ముఖ్యంగా డీఆర్ఎస్ విషయం చర్చిస్తామని దాల్మియా తెలిపారు. ఈ వ్యవహారంలో ఇతర దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయో ప్రశ్నిస్తానని ఆయన తెలిపారు.