: కేటీఆర్ ఎంటరైతే.. డీల్ ఓకే అవ్వాల్సిందేనట!
కేటీఆర్ తనను కిడ్నాప్ చేయించారంటూ ఓ ఒడిశా పారిశ్రామికవేత్త ఆరోపించడం వెనుక పెద్ద కథే నడిచింది. కోట్ల విలువైన భూభాగోతమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ లో ఎస్ హెచ్ వీజీ కన్ స్ట్రక్షన్స్ యజమాని శ్రీనివాసరావుకు 1200 గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని వంశీరాం బిల్డర్స్ కు డెవలప్ మెంట్ కు ఇచ్చేలా శ్రీనివాసరావు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.15 కోట్లకు డీల్ ఓకే అవగా.. వంశీరాం బిల్డర్స్ అధిపతి సుబ్బారెడ్డి అడ్వాన్సుగా శ్రీనివాసరావుకు రూ.5కోట్లు ఇచ్చాడు. ఇంతవరకు వ్యవహారం సజావుగానే సాగింది.
కానీ, నష్టాల కారణంగా శ్రీనివాసరావు అదే స్థలాన్ని అంతకుముందే వేరొకరి వద్ద తాకట్టు పెట్టినట్టు సుబ్బారెడ్డికి తెలిసింది. దీంతో, తానిచ్చిన అడ్వాన్సు తిరిగిచ్చేయాలని శ్రీనివాసరావుపై ఒత్తిడి తెచ్చాడు. అతను అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేయడంతో సుబ్బారెడ్డి వ్యవహారంలోకి పెద్దలను దింపాలని నిర్ణయించుకున్నాడు. ఐదు కోట్ల రూపాయల పెద్ద మొత్తం వదులుకోవడం ఇష్టంలేని సుబ్బారెడ్డి.. తనకు సన్నిహితుడైన కేటీఆర్ ను రంగ ప్రవేశం చేయించినట్టు తెలుస్తోంది.
కేటీఆర్.. ఈ వ్యవహారాన్ని తన అనుచరుడు సతీశ్ రెడ్డికి అప్పగించగా.. అతడు తనను కేటీఆర్ ఎదుటకు తీసుకువచ్చాడని శ్రీనివాసరావు 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. కేటీఆర్ ఎదుట తనను తీవ్రంగా కొట్టారని, ఐదు కోట్లు ఇవ్వకపోతే చస్తావని బెదిరించారని శ్రీనివాసరావు వెల్లడించారు.
అయితే, తనకు ఒడిశా వ్యాపారవేత్త సుభాష్ అగర్వాల్ నుంచి వంద కోట్లు రావాల్సి ఉందని.. ఆ సొమ్ము ఇప్పించగలిగితే, సుబ్బారెడ్డికి ఇవ్వాల్సిన రూ.5 కోట్లేగాకుండా, కేటీఆర్ కూ కొంత సొమ్ము ఇస్తానని శ్రీనివాసరావు కొత్త ఆఫర్ తెరమీదికి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒడిశా వ్యాపారవేత్త సుభాష్ అగర్వాల్ కిడ్నాప్ జరిగినట్టు అర్థమవుతోంది.